7 May, 2026 | 3:08 AM

టీచర్ల సమస్యలకు మోక్షమెన్నడు?

24-05-2024 12:05 AM

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గత పదేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఖాళీల భర్తీలు, పదోన్నతులు, బదిలీలు లాంటి మామూలు సమస్యలు మొదలుకొని డీఏ బకాయిలు, పీఆర్‌సీ లాంటి ప్రధాన సమస్యలూ అపరిష్కృతంగానే ఉన్నాయి. 

నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని పెద్దలు అంటుంటారు. తరగతి గదుల్లో భావిభారత పౌరులను తీర్చిదిద్దే గొప్ప అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందన్న విషయం జగమెరిగిన సత్యం. అటువంటి ఉపాధ్యాయులే సమస్యలతో సతమతమవుతుంటే, విద్యార్థులను ఏ విధంగా ఉత్త మ పౌరులుగా తీర్చిదిద్దగలరో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. తెలంగాణ నూతన రాష్ర్టం ఏర్పడినా, ప్రభుత్వాలు మారినా, గత దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని టీచర్ల తలరాతలు మాత్రం మారడం లేదు. సమస్యల వలయంలో చిక్కుకుని విద్యావ్యవస్థ అల్లాడుతోంది.అనేక ప్రాణత్యాగాలు,పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ర్టంలో తమ కష్టాలు తీరతాయని ఎదురుచూసిన టీచర్లకు నిరాశే ఎదురయ్యింది. పదేళ్ల కాలంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఏ ఒక్క సమస్య పరిష్కరింపబడకపోగా కొత్త సమస్యలు వచ్చి చేరాయనడంలో అతిశయోక్తి లేదు. నూతనంగా పాలన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఉపాధ్యాయు ల సమస్యలను పరిష్కరిస్తుందా? లేదా గత ప్రభుత్వం మాదిరిగానే దాటవేత ధోరణితో వ్యవహరిస్తుందా వేచి చూడాల్సిందే.

పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి

నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరు తూ ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాలు గత రెండు దశాబ్దాలుగా వివిధ రూపాలలో ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కొలువుదీరిన ప్రభుత్వం కూడా తమ మేనిఫెస్టో లో సీపీయస్ విధానం రద్దుచేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఏ మేరకు ఆ హామీని నిలబెట్టుకుంటుందోనని ఉపాధ్యాయ, ఉద్యోగవర్గం ఆశగా ఎదురుచూస్తున్నది. అలాగే, స్థానికతకు పాతరవేస్తూ ఉద్యోగుల జీవితాల్లో పెను తుపాను సృష్టించిన జీవో317. ఈ జీవో ద్వారా స్థానికతను కోల్పోయి వందల కిలోమీటర్ల దూరానికి విసిరివేయబడ్డ టీచర్ల బాధలు వర్ణనాతీతం. తమకు న్యాయం చేయండి మొర్రో అని ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టడం శోచనీయం.  రేవంత్‌రెడ్డి  నేతృత్వంలో కొత్త సర్కారు అధికారం చేపట్ట గానే  317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన బాధిత ఉపాధ్యాయ,ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా  సబ్ కమిటీని ఏర్పా టు చేయడం హర్షణీయం. అయితే కమిటీ కాలయాపన చేయకుండా త్వరితగతిన పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.

పదోన్నతులు, బదిలీలు లేవు

ఉపాధ్యాయులకు గత తొమ్మిదేళ్లుగా పదోన్నతులు లేవు, గత ఆరేళ్లుగా బదిలీలు లేవు. ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా గత ఏడాది ప్రారంభమైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు కేసుల కారణంగా అర్ధంతరంగా ఆగిపాయింది. ఈ లోగా పరీక్షలు, ఎన్నికల ప్రక్రియ మొదలవడం తో నిలిచిపోయిన బదిలీలను జరపడం కుదరలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించి నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని ఇప్పటికే టీచర్ల సంఘాలన్నీ ప్రభుత్వానికి  వినతిపత్రాలు ఇచ్చాయి. ఈ విషయంలో ప్రభు త్వం చొరవ చూపితే  బాగుంటుంది. 

భాషా పండితుల పోస్టుల సమస్య

ఇక భాషా పండితుల పోస్టుల ఉన్నతీకరణ (అప్‌గ్రేడ్) రావణ కాష్టంలా మండు తూనే ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినపుడు ఉత్తర్వులు విడుదల కావడం, ఎన్ని కలు అయిపోగానే మరుగునపడిపోవడం ఆనవాయితీగా వస్తున్న తంతు. ఉన్నత పాఠశాలల్లో అన్ని భాషా పండితుల పోస్టులను ఉన్నతీకరించాలన్న డిమాండ్ డిమాండుగానే మిగిలిపోతున్నది. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పోస్టులను కూడా మంజూ రు చేయాలి.

గడువు ముగిసిన పీఆర్సీ

ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీ ఇంకా ప్రకటించలేదు. రాష్ర్టంలో మొదటి పీఆర్సీ గడువు గత ఏడాది జులై మొదటి తేదీనే ముగిసింది. సంవత్సర కాలం పూర్తవుతున్నా ఇంకా  కొత్త పీఆర్సీ  కమిటీ చర్చల స్థాయిలోనే ఉంది. కమిటీ ఉద్యోగుల నుండి తీసుకున్న పీఆర్సీ ప్రతిపాదనలను క్రోడీకరించి ప్రభుత్వానికి అందజేస్తేనే ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉంటుంది.  కొత్త ప్రభుత్వం మెరుగైన ఫిట్ మెంట్‌తో రెండో పీఆర్సీని ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. నాలుగు డీఏలు పెండింగ్  ఉండడం, అలాగే పెండింగ్ బిల్లుల బకాయిలు గుట్టలుగా పేరుకుపోవడం ఉపాధ్యాయ లోకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది.

అలంకారప్రాయమైన హెల్త్ కార్డులు

ఇక వేతన జీవులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉచిత వైద్యం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. గత ప్రభు త్వం జారీచేసిన హెల్త్ కార్డులు అలంకారప్రాయంగా మారాయి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో తమకు మెరుగైన  వైద్యం అందించాలని, అందుకోసం తాము కూడా కొంత మొత్తం చందాగా చెల్లిస్తామ ని  ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినా పట్టించుకోకపోవడం బాధాకరం.  పేదల కోసం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను అమ లు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలోనూ అలాంటి  సదుపాయాన్ని కల్పిస్తే వాళ్లు ఎంతో సంతోషిస్తారు.   ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ సంఘాలతో సమావేశం ఏర్పా టు చేసి ఈ విషయమై తగు నిర్ణయం తీసుకుని  వేతన జీవుల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి.

ఖాళీటీచర్ పోస్టులు భర్తీచేయాలి

ఇలాంటి ప్రధాన సమస్యలతో పాటు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ, పాఠశాలలకు  బల్లలు, మరుగుదొడ్లు, తాగు నీరు వంటి మౌలిక వసతుల కల్పన, ఉచిత కరెంటు, స్కావెంజర్‌లను నియమించడం, విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్త కాలు, ఉచిత ఏకరూప దుస్తులు (యూనిఫామ్) అందించడం,  జిల్లా, మండల విద్యాధికార్ల పోస్టులను భర్తీ చేసి పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయడం వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించే బాధ్యత ప్రభుత్వ భుజస్కందాలపై ఉన్నది అని చెప్పడం అతిశయోక్తి కాదు. నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమవడం ఉపాధ్యా య వర్గాల్లో నూతన ఆశలను రేకెత్తించాయనడంలో సందేహం లేదు.  కొత్త ప్రభు త్వం ఏర్పడిన కొద్ది రోజులకే  పార్లమెంటు ఎన్నికలు రావడంతో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు  ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కానీ టీచర్ల అన్ని సమస్యలపైన ముఖ్యమంత్రిదృష్టిసారించడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల తక్షణం విద్యాశాఖకు ప్రత్యేకంగా ఒక  మంత్రిని కేటాయించాలి. తద్వారా సమస్యలను పరిష్కరిస్తూ ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

సుధాకర్.ఏ.వి

వ్యాసకర్త సెల్: 9000674747