7 May, 2026 | 4:07 AM

సాహిత్య రాజులు... ఒద్దిరాజు సోదరులు...

24-05-2024 12:05 AM

అది హైదరాబాద్‌లోని ఆంధ్ర సార్వస్వత పరిషత్ హాల్.. ఆ సంస్థకు ౫౦ ఏండ్లు నిండిన సందర్భంగా స్వర్ణోత్సవ సభను ఏర్పాటు చేశారు. తెలుగునాట మహామహులంతా ఆ సంబురానికి విచ్చేశారు. ముఖ్య అతిథిగా దేశ ప్రధాని పీవీ నరసింహారావు వచ్చారు. తెలంగాణ నుంచి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి కావడం, సాహిత్యంతో సంబంధంవారు కావడంతో ఏం మాట్లాడబోతున్నారోనని సభికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాట్లాడటానికి పీవీ మైకు ముందుకు రావడంతో హాలంతా నిశ్శబ్దంగా మారింది. అందరినీ ఒక్కసారి కలియుజూసిన పీవీ మాట్లాడటం మొదలెట్టారు. ‘నన్ను సభకు పరిచయం చేస్తూ అధ్యక్షులవారు బహుభాషా కోవిధులు, పండితులు అని ఏవేవో గొప్పలు చెప్పి మీ ముందు ఆవిష్కరించారు. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఇన్ని భాషలు నేర్చుకోవాలనే ఆలోచన రావడానికి, ఆసక్తి కలగడానికి కారణం ఏమై ఉంటుందో అని?’ అంటూ ప్రశ్నించారు.

ఆయన చెప్పబోయే జవాబు కోసం సభికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిశ్శబ్దాన్ని బద్ధలు కొడుతూ పీవీ మాట్లాడుతూ పోయారు. ‘మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. చరిత్రలో రికార్డు కావాల్సిన అంశం అది. తెలుగు సమాజం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అందుకే చెప్తున్నా. నాకు బహుభాషలు నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించిన వ్యక్తులు ఇద్దరున్నారు. పట్టుదల, ఆసక్తి ఉంటే ఎన్ని భాషల్లోనైనా, ఎన్ని రంగాల్లోనైనా ప్రావీణ్యం సంపాదించుకోవచ్చు అని నిరూపించిన వ్యక్తులు వాళ్లు. శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే అన్నంతగా జీవించిన వ్యక్తులు వాళ్లు. వాళ్లే ఒద్దిరాజు సోదరులు. వాళ్ల గురించి తెలుసుకున్నాక, వాళ్ల ప్రజ్ఞాపాఠవాలను దగ్గరి నుంచి చూశాకనే నేకు కూడా బహుభాషల్లో ప్రావీణ్యం సంపాదించాలనే ఆసక్తి, కోరిక, పట్టుదల కలిగాయి. ఇరువురు సోదరుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం వల్లే నాకు కూడా ప్రధాని స్థాయికి ఎదగాలనే తపన కలిగింది. ఆ ఇరువురు సోదరుల స్ఫూర్తి కారణంగానే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను’ అని చెప్పుకుంటూ పోయారు. అంతే మరుసటి రోజు కవులు, నాయకులు, ప్రసార మాధ్యమాలకు ఒద్దిరాజు సోదరులు ఎవరో, వారిని గూర్చి తెలుసుకోవాలన్న తపన మొదలయింది. ఆ సోదరుల గురించి వరుస కథనాలు వెలుగు చూశాయి. కానీ ఇదంతా గతం. కాలం మారుతున్నకొద్దీ ‘దీపదారుల’ జీవితం మరుగున పడిపోయింది. ఆ వైతాళికుల గురించి తెలుగు సమాజం ముఖ్యంగా తెలంగాణ సమాజం మరిచిపోయింది. ఆ వేగుచుక్కల గురించి ఈ తరానికి మళ్లీ చెప్పే ప్రయత్నమే ఈ కథనం. 

ఫొటోగ్రఫీ

ఒకసారి ఓరుగల్లులో నటేశన్ అనే మద్రాసీ ఫొటోలు తీస్తుంటే ఒద్దిరాజు సోదరులు ఆ వ్యక్తితో తమ ఫొటో తీయించుకున్నారట. ఈ ఫొటో తీసే యంత్రమేంటి? దాని కథేంటి? ఆ పనిని మనమెందుకు చేయలేం? ఎట్లా చేయాలి? అన్న ఆలోచనలు వారిలో కలిగాయి. ఎలాగైనా ఫొటోగ్రఫీ నేర్చుకోవాలన్న కోరికతో కలకత్తా నుంచి ఫొటోగ్రఫీపై ఉన్న పుస్తకాలు తెప్పించి బాగా చదవి, మద్రాసు వెళ్లి శ్రేష్ఠిని కలిసి, ఆయన సహాయంతో కెమెరా కొనుక్కురావడం, దానితో ఫొటోలు తీయడం మొదలుపెట్టారట. ఫొటోగ్రఫీపై ‘ఛాయాకర్షణము’ అనే పుస్తకాన్ని రచించారు. వారి తండ్రి ఒద్దిరాజు వెంకటరామారావు ఫొటో తీసి, ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు.

సంగీతశాస్త్ర జ్ఞానం

ఒద్దిరాజు సోదరులు సాహిత్యానికి మాత్రమే పరిమితం కాలేదు. సంగీతంలో సైతం ఔరా అనిపించుకున్నారు. జాయపసేనాని ‘నృత్తరత్నావళి’, భరతుని ‘నాట్యశాస్త్రం’ వంటి గ్రంథాలను చదువుతున్నంత సేపు, చేయలేని నాట్యాన్ని గురించి ఆలోచించడం కంటే సాధన చేయగలిగిన సంగీతాన్నెందుకు అశ్రద్ధ చేయాలన్న ఆలోచన కలిగిందేమో? ఈ సోదరులిద్దరూ అందుకు ఉద్యుక్తులయ్యారు. వారి గ్రామంలోని దేవాలయంలో భగవంతునికి కైంకర్యం చేసే సమయంలో ఫిడేలు వాయించే మామిడాల పాపయ్య వద్ద దానిని వాయించడం నేర్చుకోవడం వారి సంగీతాభిలాషను తెలుపుతున్నది. 

విజ్ఞాన సృష్టికర్తలు.. ఒద్దిరాజు సోదరులు


తల్లే తొలి గురువుగా సాహిత్యాభ్యాసం

విజ్ఞాన సముపార్జనలో నిత్య తాపత్రయం

ఇనుగుర్తికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన అన్నదమ్ములు

తెలుగు భాషకే వన్నెకూర్చిన ప్రజ్ఞామూర్తులు

మొట్టమొదటి ‘తెనుగు’ పత్రిక వ్యవస్థాపకులు

ఖండాంతరాలకు ఓరుగల్లు కీర్తి పంచిన మేధావులు


ఇనుగుర్తి.. ఓ కుగ్రామం. రవాణా వ్యవస్థ కూడా సరిగ్గా లేని మారుమూల ప్రాంతం. అక్కడ నుంచి ప్రపంచమే అబ్బురపడే స్థాయి మేధావులు పుట్టుకొచ్చారు. రాయడం కాదుకదా.. కనీసం చదవడం కూడా రాని ఇద్దరు సోదరులు తెలుగు భాషకు ఎనలేని కీర్తికిరీటాలు తెచ్చిపెట్టారు. తల్లి పొత్తిళ్లలో విన్న భారత, భాగవతాలతో మొదలైన వారి భాషా జిజ్ఞాస, కాలగమనంలో సొంతూరికే అచ్చుయంత్రం తెచ్చి పదుల సంఖ్యలో వారు రాసిన పుస్తకాలు అచ్చువేసే వరకు తీసుకెళ్లింది. తెలుగులో ‘తెనుగు’ పేరుతో మొదటి పత్రిక ప్రచురణ ప్రారంభించి సమాజ స్థితిగతిని మార్చేందుకు కంకణం కట్టుకున్న వారే ఒద్దిరాజు సోదరులు. ఒద్దిరాజు వెంకటరామారావు, రంగనాయకమ్మ పుణ్యదంపతుల సంతానమే ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, రాఘవ రంగారావు. 12 పేజీలతో వెలువడిన తెనుగు పత్రిక కోసం సోదరులు ఎంతో శ్రమించారు. 

వంశం పుట్టుపూర్వోత్తరాలు..

ఒద్దిరాజు సోదరుల వంశం ఒడిశా కేంద్రంగా వచ్చిందని చరిత్ర చెప్తుంది. మరో విశేషం ఏమిటంటే వీరి వంశ ప్రాశస్త్యం గురించి వారే శోధించి రాసుకోవడం. తమ పూర్వీకులది ఒడిశాలోని ఒద్ర అని, అక్కడ నుంచి వచ్చిన మూలాలు కాలక్రమేణా ఒద్దిరాజు అయినట్టు చెప్పుకొచ్చారు. ఆ వంశ వృక్షంలో ఒద్దిరాజు సోదరులు 17వ తరానికి చెందినవారు. 

తల్లే తొలి గురువు

సీతారామచంద్రరావు, రాఘవ రంగారావుకు తల్లి రంగనాయకమ్మ మొదటి గురువు. తల్లి ఒడిలో ఉన్నప్పుడే సోదరులిద్దరూ భారత, భాగవతాలు నేర్చుకున్నారు. బాల్యంలో వారిద్దరూ ఒక్కరోజు కూడా బడికి వెళ్లిన సందర్భం లేదు. దైవానుగ్రహంతో వరంగా వచ్చిన ఏక సంతాగ్రాహిత్యంతో నేర్చుకోవడమే వారికి అలవాటైంది. వారిలోని పట్టుదల, విషయ పరిణితిని గ్రహించిన తండ్రి వెంకట రామారావు.. హైదరాబాద్ నుంచి మనుచరిత్ర, వసు చరిత్ర వంటి సుమారు 40కి పైగా గ్రంథాలను తెప్పించి ప్రోత్సహించారు.   

గోపాలకృష్ణ శాస్త్రి శిష్యరికంలో

ఒద్దిరాజు సోదరులకు నేర్చుకోవడం అనే కాంక్ష నానాటికీ పెరగడంతో పుస్తకపఠనం వారికి ఓ వ్యసనంగా మారింది. ఈ క్రమంలోనే సోదరులిద్దరూ చెరకుపల్లి గోపాలకృష్ణ శాస్త్రి దగ్గర వేదాలు, షోడశ కర్మలు, దేవయాజ్ఞికలను అభ్యసించారు. లోకల్ ఫండ్ పాఠశాలలో పనిచేస్తున్న వనం కోటయ్య దగ్గర ఒద్దిరాజు సోదరులు పలు భాషలు నేర్చుకున్నారు. నిజాం రాజుల కాలంలో అధికార భాషగా ఉన్న ఉర్దూను కూడా నేర్చుకుని తమ పట్టుదలను నిరూపించుకొన్నారు. దానితోపాటు పార్శీ భాష కూడా వారి వశమై మురిసిపోయింది. నీటిపారుదల శాఖలో పనికోసం ఇనుగుర్తికి వచ్చిన కెంప్ వద్ద ఇంగ్లిష్ నేర్చుకున్నారు. కేవలం 20 రోజుల్లో 26 పాఠాలను నేర్చుకుని తమకు తామే సాటి అని అనిపించుకున్నారు. కెంప్ బదిలీతో మోపర్తి రామకృష్ణయ్య దగ్గర ఇంగ్లిష్ పరిజ్ఞానం మొత్తం సంపాదించారు. ఆ తర్వాత సోదరులిద్దరూ ఆంగ్లంలో కవితలు రాసేస్థాయికి ఎదిగారు. 

ఇనుగుర్తికి ‘అచ్చుయంత్రం’ 

పుస్తకాలు సమకూర్చడమే గాక ప్రచురణ కూడా అందుబాటులోకి తేవడానికి ఒద్దిరాజు సోదరులు చొరవ తీసుకున్నారు. రుద్రమదేవి పుస్తక ప్రచురణ వేళ విజయవాడలో గడిపిన సోదరులకు ప్రింటింగ్‌పై కూడా అవగాహన వచ్చింది. ఆ కొద్ది కాలంలోనే నైపుణ్యాన్ని నేర్చుకున్న వారిని అచ్చుయంత్రం తేవడానికి పురిగొల్పింది. అనుకున్నదే తడవుగా మద్రాస్ వీరన్నశెట్టి ప్రోత్సాహంతో అచ్చు యంత్రం, వర్ణాలు తెచ్చి ‘విజ్ఞాన ప్రచార్ణి ముద్రణాలయం’ అనే పేరుతో మొదలుపెట్టారు. అందులో సోదరులిద్దరూ స్వతహాగా రాసిన ఉపదేశ రత్నమాల (విశిష్టాద్వైత మత గ్రంథం) అనే పుస్తకాన్ని మొట్టమొదట అచ్చేసి చరిత్ర తిరగరాశారు. పనిభారం పెరగడంతో కొందరు గ్రామస్తులకు పని నేర్పించి ఉపాధి కల్పించారు. 

ఇనుగుర్తిలో ప్రచురితమైన సోదరుల గ్రంథాలు

వీరావేశము, బ్రాహ్మణ సాహసము, భ్రమర, భక్తిసార చరిత్రము, వరాహముద్ర, రుద్రమదేవి (ద్వితీయ ముద్రణ), శౌర్యశక్తి వంటి సుమారు 20కి పైగా పుస్తకాలు అచ్చయ్యాయి. 

గ్రంథాల కోవెల 

చదువు విలువ తెలిసిన వారుగా ఒద్దిరాజు సోదరులు ప్రజలకు పుస్తకాల నిధిని సమకూర్చారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఒద్దిరాజు సోదరులు అక్కడి సమాలోచనల అనంతరం ‘విజ్ఞాన ప్రచారిణి’ని స్థాపించాలనే నిర్ణయానికి వచ్చి స్వగ్రామం ఇనుగుర్తిలో దానిని ఆచరణలో పెట్టారు. 

వందేళ్ల పండుగ 

పీవీ ఉపన్యాసంతో ఒక్కసారిగా తెలుగు సమాజంతోపాటు ప్రపంచం దృష్టంతా ఒద్దిరాజు సోదరులపై పడింది. సాహిత్యకారులు, కవులు, మేధావులు తమ పరిశోధనలను విస్తృతం చేశారు. ఇనుగుర్తికి ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే డాక్టర్ బిరుదురాజు రామరాజు ‘సాహిత్యోద్ధారకులు’ అనే పరిశోధన వ్యాసాన్ని ప్రచురించారు. అలాగే ఒద్దిరాజు సోదరులు రాసిన 68 గ్రంథాల గురించి కూడా ప్రస్తవించారు. అలా ఒద్దిరాజుల భాషా పాండిత్యం, భాషా సేవలు ప్రపంచానికి తెలియడంతో పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం కూడా ఒకడుగు ముందుకేసి వారి కుటుంబసభ్యుల సహకారంతో ఒద్దిరాజు సోదరుల శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది.  

దారుశిల్ప నైపుణ్యం

ఒద్దిరాజు సోదరులు సకల కళాపారంగతులు అని చెప్పడానికి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఇనుగుర్తిలోని చెక్క (కలప)తో చేసిన వారి ఇంటి ముఖద్వారమే గొప్ప సాక్ష్యం. సమస్త శాస్త్రాలే కాదు సమస్తకళలు, చేతి పనులూ వారి వశమయ్యాయి. వడ్రంగం, కమ్మరం, తాపీపని, సూచీకర్మ, చర్మకార విద్యలు కూడా వారు అభ్యసించారు. తోలుతో కాళ్లకు వేసుకోవడానికి ఆకు చెప్పులు, చక్కని సూట్‌కేసులు వారే స్వయంగా చేసుకున్నారు. ఇలా చెప్పలేనన్ని నైపుణ్యాలను ప్రపంచానికి చూపించారు. ఒద్దిరాజు సర్వకళా సంపన్నులనడానికి మరో ఉదాహరణ వీరి పాకశాస్త్ర ప్రావీణ్యతే. అద్భుతమైన వంట చేయడం కూడా వీరికి చిటికెలో పని. వీరి దృష్టి ఆయిల్ ఇంజిన్‌పై కూడా పడింది. అది ఎట్లా పని చేస్తుంది? దానికి ఉపయోగించే వస్తుసామగ్రి ఏమిటి? అనే ప్రశ్నలతోపాటు విద్యుచ్ఛక్తితో అది నడిచే విధానమంతా తెలుసుకోవాలనుకున్నారు. ఆ కాలంలో ఈ విధమైన ప్రయోగాలు చేయడమంటే పెద్ద సాహసమే 

నేనూ వాళ్ల శిష్యున్నే

మా ఊరిలో ఒద్దిరాజు పంతుళ్లు చదువు చెప్తుండేవారు. మా అయ్యవ్వ నన్ను కూడా వాళ్ల దగ్గరికే చదువుకు పంపించారు. వాళ్లు గ్రామంలోని పిల్లలందరికీ ఉచితంగా బోధించేవారు. ఆ కాలంలోనే చదువు గొప్పతనాన్ని ముందు తరాలకు అందించాలని చేసిన ప్రయత్నం మాకు అప్పుడు అర్థం కాలేదుగానీ, పెరుగుతా ఉంటే వారి ప్రయత్నం ఎంత గొప్పదో తెలిసింది. అదీకాకుండా ఒద్దిరాజు గురువులు మా ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉచితంగా వైద్యం అందించేవారు. 

-శారు యాదవరెడ్డి 

ఇంట్లోనే పేపర్ ప్రింట్ చేసేవారు

సమాజాన్ని చైతన్యం చేసే ఆయుధం పేపర్ అని గ్రహించి ఆ రోజుల్లోనే ఒద్దిరాజు సోదరులు ‘తెనుగు’ పత్రికను ప్రారంభించారు. అప్పటి రవాణా వ్యవస్థ సహకరించపోయినా, అడవులు దాటాల్సిన పరిస్థితులు ఉన్నా ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదు. మొదట పేపర్ రాసుకుని వరంగల్ వెళ్లి ప్రింట్ చేయించుకుని గ్రామానికి తీసుకొచ్చేవారు. కొద్ది కాలం తర్వాత మిషన్లు తీసుకొచ్చి సొంతింటిలోనే పేపర్ ప్రింట్ చేశారు. మేము ఆ యంత్రాలను విచిత్రంగా చూసేవాళ్లం.

-నాళ్ల రఘువీర్

వాళ్లతోనే ఇనుగుర్తికి గుర్తింపు

ఇనుగుర్తికి ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే ఒద్దిరాజు సోదరులే కారణం. మాది వారి పక్కిల్లే. ఒద్దిరాజు సోదరుల ఇంటికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చదువుకోవడానికి వచ్చేవారితో సందడిగా ఉండేది. నేను కూడా చదువు నేర్చుకోవడానికి వెళ్లి నాతోటి పిల్లలతో కూర్చునేవాడిని. నేను ఒక విద్యార్థిగా చదువుకుంటున్నాను అనుకున్నానేగానీ, ఇంతటి పెద్ద గురువుల వద్ద విద్య నేర్చుకుంటున్నానని ఏనాడూ ఊహించలేదు. మా గ్రామ గొప్పతనమే కాదు, వారి దగ్గర చదువుకున్న వందల మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. 

-దీకొండ వెంకన్న 

వాళ్ల గొప్పతనమే నాకు ప్రేరణ

2014 సమయంలో ఉస్మానియా యూని వర్సిటీ నుంచి ఏదైనా పరిశోధన చేద్దామనుకున్న సమయంలో ఒద్దిరాజు సోదరులకు సంబంధించిన ఒక సంచికను మామయ్య కొండపల్లి శేషగిరిరావు దగ్గర చూశాను. ఆ సంచిక చదివిన తర్వాత ఇన్ని అంశాలు రాశారు కదా! వీళ్ల పేరు సాహిత్యంలో లేదు కదా? అనే వెలితి అనిపించింది. ఇద్దరు కూడా కథలు, కవితలు, నాటకలు, నాటికలు, నవలలు, వ్యాకరణం మీద రాసిన అంశాలు చాలా ఉన్నాయి. తర్వాత సంస్కృతంలోని పానిణీయ వ్యాకరణాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. అట్లా అన్ని సాహిత్య ప్రక్రియలు రాశారు. కథలు, నాటకాలన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వాటిని ఈ మధ్యకాలంలో రెండు పుస్తకాలుగా కుటుంబసభ్యులు ప్రచురించారు. అవి మేనరికం, దుష్ట పంచాయితి. అవన్నీ సామాజిక అంశాలకు సంబంధించినవే. నాటికల్లో రెండు రకాలు తీసుకొచ్చారు. వాటిలో ఒకటి సామాజిక నాటికలు. రెండోవి పౌరాణిక నాటికలు. అప్పడే వాళ్ల కుటుంబ సభ్యులను కలిశాను. అంతకుముందే కాకతీయ యూనివర్సిటీలో ఒక సార్ పరిశోధన చేస్తున్నారని తెలిసి వెళ్లి కనుక్కున్నాను. కానీ ఆయన పరిశోధన చేయాలేదని తెలిసింది. అక్కడ నాకు కొంచెం సమాచారం లభించింది. తర్వాత బిరుదురాజు రామరాజుగారు వీళ్లను గురించి చాలా పరిశోధనాత్మక వ్యాసాన్ని రాశారు. అది నాకు బాగా ఉపయోగపడింది.

పీహెచ్‌డీ సీట్ రావడం వల్ల మళ్లీ చదవడం మొదలు పెట్టాను. ఇక అప్పటి నుంచి నా వేట మొదలైంది. ఒద్దిరాజు సోదరుల సమాచారం కోసం వాళ్ల కుటుంబ సభ్యులను కలిశాను. వాళ్లు బాగా సహకరించారు. చాలావరకు వాళ్ల చేతిరాతతో ఉన్న సాహిత్యాన్ని నాకు అందించారు. నాకు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ఆధ్వర్యంలో పరిశోధన చేయడానికి ఉస్మానియా యునివర్సిటీ అవకాశం ఇచ్చింది. వాళ్ల మీదనే ఎందుకు పరిశోధన చేశానంటే.. ఆ కాలంలో కనీసం పాఠశాలలు లేవు. తెలుగుకు విలువలేని కాలంలో వాళ్లే స్వయంగా అన్నీ నేర్చుకున్నారు. ఒద్దిరాజు సోదరులపై పరిశోధనకు దాదాపు నాకు ఐదు నుంచి ఆరు సంవత్సరాల కాలం పట్టింది. 2009 లో నేను రాసిన మొట్టమొదటి ఆర్టికల్ ఒద్దిరాజు సోదరుల గురించి. ఆ ఆర్టికల్ అప్పుడు ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఒద్దిరాజు సోదరుల వ్యాసాన్ని చదివి కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. అదీ ఆంధ్ర, రాయలసీమ నుంచి. ఇంత తెలివిగల వాళ్లు మీ దగ్గర ఉన్నారా అమ్మ? అని అడిగారు. అలా వీళ్ల గురించి వ్యాసాలు వివిధ పత్రికలకు రాశాను. ఒద్దిరాజు సోదరులు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ, తెలు గు, ఇంగ్లిష్‌లో రచనలు చేశారు. మనకు దొరికినవి తెలు గు, తమిళం, ఇంగ్లిష్ మాత్ర మే. ఇంతగొప్ప వ్యక్తులతో కుటుంబ సంబంధం ఉండటం చాలా సంతోషకరమైన విషయం. మా మేనత్తను ఒద్దిరాజు రాఘవరంగరావుగారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూతురే ధమయంతి. ఆమె గొప్ప పండితురాలు. ఆమె నాకు మేన ఒదిన అని చెప్పుకోవడానికి గర్వంగా అనిపిస్తోంది. వాళ్ల గొప్పతనం అంతా నాకు ప్రేరణగానే అనిపిస్తుంది. ఒద్దిరాజు రాఘవరంగారావుగారి మనవరాలిని మా అన్నయ్యకు ఇచ్చారు. తర్వాత తరంలో కూడా ఆ బంధం కొనసాగుతున్నది.  

 -కొండపల్లి నీహారిణి