03-02-2026 05:45:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు) కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నందున తమ విధులపై స్పష్టమైన అవగాహనతో, నిష్పక్షపాతంగా పనిచేయాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారు మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన నియమాలు, పోలింగ్ కేంద్రాలలో పర్యవేక్షణ విధానం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ ప్రక్రియలో జాగ్రత్తలు వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సూక్ష్మ పరిశీలకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.