26 August, 2026 | 9:50 PM

ఎరుకల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

26-08-2026 08:13 PM

తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు 

గణపురం,(విజయక్రాంతి): తెలంగాణలో ఆదివాసులలో భాగమైన ఎరుకల సామాజిక వర్గం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు.

బుధవారం గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు కొన్ని ఆదివాసీ వర్గాలకే పరిమితమవుతున్నాయని అన్నారు. ఎరుకల సామాజిక వర్గానికి రాజకీయ, సామాజిక, ఆర్థికంగా తగిన ప్రాధాన్యం కల్పించేందుకు ప్రత్యేకంగా ఐటీడీఏ తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎరుకల అభివృద్ధికి ప్రత్యేక ఏకలవ్య సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సుమారు రూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే ఏకలవ్య సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతిరి రాజశేఖర్, కోనేటి రాజు, మానుపాటి రమేష్, పూతాడి కుమారస్వామి, పాలకుర్తి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.