15 April, 2026 | 3:56 AM

వితండ వాదన

15-04-2026 01:39 AM

హైబ్రిడ్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రపంచంలో ఎక్కడా లేదు

  1. రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని పాటిస్తారా? 
  2. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో సీట్లు తగ్గి.. 
  3. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పెరుగుతాయి కదా! 
  4. కాంగ్రెస్ పార్టీకి కోశాధికారి.. ఆ పార్టీలో అతి మేధావి సీఎం రేవంత్‌రెడ్డి 
  5. కోడిగుడ్డుమీద ఈకలు పీకడం సరికాదు 
  6. తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసింది కాంగ్రెస్ పార్టీయే
  7. ఉపరాష్ట్రపతి పదవులు చేపట్టిన వాళ్లు దక్షిణాది వాళ్లు కాదా? 
  8. రాహుల్ యూపీ వదిలి కేరళకు రాలేదా?
  9. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, దేశంలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ నమూనాను ఆయన తప్పుబట్టారు. అసలు ఇలాంటి నమూనా ఎక్కడా లేదని ఆయన కొట్టిపారేశారు. ‘తెలంగాణాలోనూ ఇదే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తారా? అలా అయితే.. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌కు సీట్లు తగ్గుతాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సీట్లు పెరుగుతాయి. తెలంగాణ ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది, అలాగని 70 శాతం సీట్లు హైదరాబాద్‌కే ఉండాలా?’ అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా ఆర్థిక వనరులు, ఇతర అంశాలను ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది కంటే గుజరాత్ వంటి రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్నారు. కేంద్రం అన్ని ప్రాంతాల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటుందన్నారు.

రేవంత్‌రెడ్డి వితండవాదాన్ని పక్కనబెట్టి బిల్లుకు సహకరించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతున్నాయని, అయినా వితండవాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేంద్రప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం అమలుకు అవసరమైన సవరణలు ఈనెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటులో చర్చించబోతున్నామన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దేశ జనాభాలో సగంమంది అయిన 75 కోట్ల మంది మహిళల ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధిలో ప్రాధాన్యత కల్పించేందుకే మోదీ ఈ బిల్లును తీసుకొచ్చారన్నారు. 

ఇది కీలక ముందడుగు..

గత 50 ఏళ్లుగా దీనిపై చర్చ జరుగుతోందని, 2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో పాస్ అయింది.. కానీ వివిధ కారణా లతో ఈ బిల్లు కార్యరూపం దాల్చలేదన్నారు. ఇది 50 శాతం జనాభా ఉన్న మహిళల ఆత్మగౌరవానికి, రాజకీయ పరమైన విశ్వాసం కల్పించే ప్రక్రియ అన్నారు. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్త శక్తినిస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం చట్టం కాదు. మహిళా సాధికారతకు వేస్తున్న కీలకమైన ముందడుగన్నారు.

దీంతోపాటు గా డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరగనుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తాము అనేక చర్యలు చేపట్టామని, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్, జీఎస్టీ, ఉగ్రవాదాన్ని అరికట్టే విషయం, రాష్ట్రాల పన్నుల వాటా పెంచడం.. వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన విమర్శించారు. అందరి సహకారంతో.. మహిళాబిల్లుకు సవరణలు తీసుకొచ్చి.. అమలు ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

ప్రజలు హర్షిస్తున్న ఈ అంశంపై.. కాంగ్రెస్ విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. దక్షిణాదిన జనాభా తక్కు వ, ఉత్తరాదిన జనాభా ఎక్కువ కాబట్టి జనా భా ప్రాతిపదికన చేస్తే దక్షిణాదికి నష్టమన్నారని, ఇవాళ ఆ సమస్యను అధిగమించి.. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని ఆలోచించి మోదీ సర్కారు నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

దక్షిణాదికి కీలక బాధ్యతలిచ్చాం..

నరేంద్రమోదీ.. తెలుగు ప్రజలకు, దక్షిణాదికి కీలకమైన మంత్రిపదవులు ఇవ్వలేదని విమర్శిస్తున్నారని, గత 11 ఏళ్లుగా.. దక్షిణాదినుంచి ఇద్దరు ఉపరాష్ట్రపతులను ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. దక్షిణాదినుంచి ఆర్థిక, రక్షణ, వాణిజ్య, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ.. వంటి ఎన్నో బాధ్యతలు ఇచ్చామని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మం త్రిగా ఉన్నారని, రైల్వే, ఎరువులు రసాయనాల శాఖ మంత్రిగా చాలా మంది ఉన్నారన్నారు.

రేవంత్ ఈ విషయంలో చేసిన విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. దక్షిణాది నాయ కులను వేర్వేరు రాష్ట్రాలనుంచి రాజ్యసభకు పంపించి కేంద్రమంత్రులు చేసిన ఘనత బీజేపీదన్నారు. రాహుల్‌గాంధీ మరిఎందుకు యూపీ వదిలిపెట్టి కేరళకు వచ్చారని, అభిషేక్ సింఘ్వీ ఉత్తరాదిని వదిలిపెట్టి తెలంగాణకు ఎందుకొచ్చారని, దీనికి రేవంత్ సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. మనమంతా భారతీయులమని, ఎక్కడినుంచైనా ఎంపిక కావొచ్చన్నారు.

ఆదాయం ప్రాతిపదికన కుదరదు..

పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, ఇప్పుడు సీట్ల పంపకాలను కొనసాగిస్తూ.. సీట్ల పెంపుదల చేస్తామని మోదీ స్పష్టంగా చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ పునర్విభజన చేసినప్పుడు.. దక్షిణాదికి 24 శాతం సీట్లున్నాయి.. ఇప్పుడు సీట్ల సంఖ్య పెంచినా.. 24 శాతం సీట్లే ఉంటాయని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా మోదీ ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. దక్షిణాదికి, ఉత్తరాదిని విభజించేలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, దీన్ని రాహుల్ అంగీకరిస్తారా? అని పేర్కొన్నా రు.

ఇన్నాళ్లూ జనాభా ప్రాతిపదికన వద్దన్నా రు.. ఇప్పుడేమో జీఎస్డీపీ పేరుతో కొత్త పల్లవి అందుకుంటున్నారని ఫైరయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం కాంగ్రెస్ నాయకులకు అలవాలైందని ఇలాంటి సున్నితమైన అంశాలను చర్చించి పరిష్కారం వెత కాలి తప్ప రాజకీయం చేయకూడదని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నది.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధమని, కాంగ్రెస్ పార్టీకి వీలుంటే.. నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి తప్ప.. వాస్తవ విరుద్ధంగా మాట్లాడొదన్నారు.

రేవంత్‌రెడ్డి వితండవాదాలను పక్కనపెట్టి.. సాను కూలంగా ఈ బిల్లు పాసయ్యేలా సహకరించాలని కోరారు. సీట్లు ఎక్కడ పెరిగినా.. అవి బీజే పీ ఖాతాలో పడవని.. ఎవరు ఎంపీగా ఉండా లి, ఎవరు అధికారంలో ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారని, చట్టాల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడవు.. ప్రజలు ఆశీర్వదిస్తేనే గెలుస్తామన్నారు. గతంలో ఉన్న ప్రాతిపదికనే అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచడం మంచి నిర్ణయమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రాహుల్, రేవంత్ అతిమేధావులు.. 

గత కొద్దిరోజులుగా డీఎంకే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలపై అనేక రకాలుగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, యూపీఏ నాయకులు చేయలేని పనులు మోదీ దేశంలో అనేకం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి వితండవాదంతో తమను విమర్శించడం సరికాదన్నారు. ‘ఆయన బీజేపీని, నన్ను విమర్శిస్తూ.. బంట్రోతులని అన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలుగు ప్రజలను, తెలుగు నాయకులను బంట్రోతులుగా చూసిందని, ఇష్టారాజ్యం గా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రులను మార్చారు.

నాడు విమానాశ్ర యంలో అంజయ్యను రాజీవ్‌గాంధీ ఎలా అవమానించారో రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలి’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి.. రాహుల్ గాంధీ అయితే.. రెండో అతిమేధావి.. రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా మారారని ఆరోపించారు. ‘చేత నైతే సమర్థించండి.. లేదంటే నోరు మూ సుకుని కూర్చోండి అంతే తప్ప.. ప్రజలను తప్పుదారి పట్టించే పనులు చేయొద్దు’ అని మండిపడ్డారు.

‘ఎవరైనా ఎక్కడినుంచైనా ఎంపిక కావొచ్చు.. అంతే తప్ప.. అర్థంలేని విమర్శలతో.. కోడిగుడ్డుమీద ఈకలు పీకడం సరికాదన్నారు. ఇటీవల కర్ణాటక సీఎం.. ఢిల్లీకి వస్తే.. ఆయనకు మూడ్రోజులపాటు అడిగినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, పెద్ద నేతలను బంట్రో తులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విమర్శించారు.