హైదరాబాద్‌లో వర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్
- నగరంలో ఆఫ్‌షోర్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న లండన్ వర్సిటీ
- బేగంపేట్ లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో తాత్కాలిక ఏర్పాటుకు చర్యలు
- భారత్ ఫ్యూచర్ సిటీ ఎడ్యుకేషన్ జోన్‌లో శాశ్వత నిర్మాణానికి ప్రణాళికలు
- తెలంగాణను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు సఫలం
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యావ్యాప్తి కోసం గత కొన్ని నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన ఆఫ్‌షోర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. నగరంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ సంస్కృతి, అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్‌ను ఎంచుకున్న తొలి అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా చరిత్రలో ఈ యూనివర్సిటీ నిలవనుంది.
యూకేలోని కింగ్స్ కాలేజ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రపం చ ప్రఖ్యాత సంస్థలు ఈ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలుగా ఉన్నాయి. తాజాగా, ఆ విశ్వవిద్యాలయమే తెలంగాణ లో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, ఆదేశాలిస్తున్నారు.
రాబోయే రెండేళ్ల కాలంలో, ప్రపంచ ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థల ఆఫ్-షోర్ క్యాంపస్‌లతో కూడిన ఒక నాలెడ్జ్ హబ్‌ను భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పరిశోధనా సంస్థలు, సాఫ్ట్ వేర్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాలు హైదరాబాద్‌లో ప్రతిషాత్మకంగా ఉండటం వల్ల ప్రధానంగా మరిన్ని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ జోన్‌లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రాంగణాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాగా, విశ్వవిద్యాలయాలు తమ విద్యా కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక చర్యలు తీసుకుంటోంది. నగరంలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ తాత్కాలిక క్యాంపస్‌గా హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
2027లో విద్యా సంవత్సరంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు యూజీసీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు విశ్వవిద్యాలయాలు ఫ్యూచర్ సిటీలో శాశ్వత క్యాంపస్‌ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నాయి.
హైదరాబాద్‌లో తమ బ్రాం క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఇటీవల ముందుకు వచ్చిన యూకేకి చెందిన 13 పాఠశాలలకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యూకే ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. జాతీయ విద్యా విధానం-2020లోని నిబంధనల ద్వారా, తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపే అంతర్జాతీయ విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిన విషయం తెలిసిందే.






