26 March, 2026 | 2:06 AM

బచ్చోడులో ఆధ్యాత్మిక వైభవం.. శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠాపన

26-03-2026 12:19 AM

కన్నులపండువగా శివ-కేశవుల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం

వేద మంత్రోచ్ఛారణల మధ్య శిఖర కలశ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి

తిరుమలాయపాలెం(కూసుమంచి), మార్చి 25(విజయక్రాంతి): మండల పరిధిలోని బచ్చోడు గ్రామం బుధవారం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. గత మూడు రోజులుగా అత్యంత నిష్ఠతో నిర్వహిస్తున్న శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్ల సహిత శ్రీరామ లింగేశ్వర, కనకదుర్గమ్మ ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం నాటి ప్రధాన ఘట్టంతో వైభవంగా ముగిశాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయ సముదాయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కోసం సోమవారం నుంచే వేద పండితులు శాస్త్రోక్తంగా జలధివాసం, ధాన్యధివాసం వంటి క్రతువులను నిర్వహించారు.

సుముహూర్తాన ప్రాణ ప్రతిష్ఠ

ఉత్సవాల్లో అత్యంత కీలకమైన చివరి రోజైన బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో హోమగుండాల నుంచి వెలువడిన వేద మంత్రోచ్ఛారణలు మారుమోగాయి. ఉదయం 6:30 గంటలకు వాస్తు పూజ, పంచలోహ నవరత్న స్థాపన, జీవం పోయుట వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఉదయం 9:50 గంటల సుముహూర్తాన విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఘట్టాలను కన్నులపండువగా నిర్వహించారు.

మంగళవాయిద్యాల మధ్య స్వామివార్ల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కావించడంతో భక్తుల జయజయధ్వానాలతో బచ్చోడు పులకించింది. ఈ కార్యక్రమంలో రామసహాయం నరేష్ రెడ్డి, రామసహాయం అరవింద్ రెడ్డి, హరిత రెడ్డి, బెల్లం శ్రీను, గండ్ర గోపాలరావు, కొప్పుల అశోక్, మంగీలాల్, ఉన్నం రాజశేఖర్, ఎన్.లింగయ్య, బి.సుదర్శన్, కరీం, వనవాసం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.