8 March, 2026 | 3:42 AM

మహిళా చట్టాలపై అవగాహన ఉండాలి

08-03-2026 12:12 AM

అప్పుడే అసలైన సాధికారత సాధ్యం 

రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, మార్చి 7(విజయక్రాంతి): మహిళలు తమకు ఉన్న చట్టపరమైన హక్కులను, రక్షణ చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులను అడ్డుకోవాలంటే చట్టాలపై అవగాహన ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. చదువుతో పాటు మహిళా రక్షణ చట్టాలను కూడా అధ్యయనం చేయాలని, అది ఆపద సమయంలో రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థిక స్వేచ్ఛ మాత్రమే కాదని, సమాన అవకాశాలు పొందడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండడమేనని డాక్టర్ పూనం మాలకొండయ్య పేర్కొన్నారు.

సమాజం మీకు అవకాశాలు ఇవ్వడం కాదు, మీరే సమాజానికి మార్గదర్శకులుగా మారాలని విద్యార్థులను కోరారు. పరిపూర్ణత కోసం కష్టపడాలని, ఆత్మవిశ్వాసమే మీ గొప్ప ఆయుధమని హితవు పలికారు. మంచి వారితో మంచిగా ఉండాలని, కఠినంగా వ్యవహరించే వారిపట్ల అంతే దృఢంగా వ్యవహరించాలని సూచించారు.

అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడూ మౌనంగా ఉండకూడదన్నారు. ఒత్తిడిని జయించాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, టైమ్ మేనేజ్‌మెంట్ పాటించడం ముఖ్యమని వివరించారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ మహిళల స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయని ఆమె విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.