వ్యవసాయంపై ఎండ్రిన్ చల్లడమే
- ప్రభుత్వ ప్రతిపాదనలను ఈఆర్సీ రిజెక్ట్ చేయాలి
- టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : ‘రైతు డిస్కం’ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేట ముంచే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల పేరుతో చేపట్టిన ఈ చర్య రైతుల పాలిట శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు డిస్కం ఏర్పాటు వ్యవసాయంపై ఎండ్రిన్ చల్లడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీజీఈఆర్‌సీ) శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌లో కవిత తన వాదనలు వినిపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రైతులకు మంచి చేసే ఆలోచనలో ఉంటే ఆరు నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు దాచి ఉంచిందో చెప్పాలన్నారు.
రూ. 25 వేల కోట్ల నష్టంతో ఉన్న డిస్కంను కంపెనీ పేరుతో ఎలా రిజస్టర్ చేస్తారని ఆమె ప్రశించారు. రైతుల భవితవ్యానికి సంబంధించిన ఈ అంశాన్ని ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయించటం సరికాదని, 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. ఆమోదయోగ్యం కాని ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని కోరారు. రైతులకు అన్యాయం చేస్తే 1999 నాటి కాల్పుల ఘటన పునరావృతం అయ్యే పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈఆర్సీ నుంచి అనుమతి రాకుండానే జూన్ 2 నుంచి కొత్త డిస్కం ప్రారంభమవుతుందని సీఎం మాట్లాడటం సరికాదన్నారు. రైతు డిస్కంలో ఆంధ్రా ఉద్యోగులకు పెత్తనం కట్టేబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే జెన్ కో, రెడ్ కో, సదరన్ డిస్కం.. ఇలా అన్నింట్లో ఆంధ్రావాళ్ల పెత్తనమే ఉందన్నారు. తెలంగాణ డిస్కంలలో ఆంధ్రావాళ్ల పెత్తనం ఉండొద్దని కవిత కోరారు. పెట్టాల్సి వస్తే తెలంగాణ వాళ్లే ఉండాలన్నారు.






