30 May, 2026 | 2:40 AM

కొంపముంచిన ‘కోయెంప్’!

30-05-2026 02:06 AM

జ్యుడీషియల్ విచారణ చేపట్టాలి: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ 

  1. ‘గ్లోబరేనా’కు 2019లో తెలంగాణ ఇంటర్ ఫలితాల బాధ్యతలు
  2. తప్పుల తడకగా సంస్థ డిజిటల్ మూల్యాంకనం, ఓఎస్‌ఎం 
  3. ప్రతిభావంతులైన విద్యార్థులకూ సింగిల్ డిజిట్ మార్కులు 
  4. మనస్తాపం చెంది సుమారు 20 మంది బలవన్మరణం
  5. వివాదం తర్వాత సంస్థ పేరు ‘కోయెంప్’గా మార్పు
  6. తాజాగా సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం బాధ్యతల స్వీకరణ 
  7. ఈ ఫలితాల్లోనూ నాటి తప్పులు పునరావృతం 
  8. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన 
  9. వైఫల్యాల చరిత్ర ఉన్న సంస్థకు కాంట్రాక్ట్ ఎలా అప్పగిస్తారని నిలదీత

హైదరాబాద్, మే ౨౯ (విజయక్రాంతి): గ్లోబరేనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా కోయెంప్ ఎడ్యు టెక్ ప్రైవేట్ లిమిటెడ్.. కంపెనీల పేర్లు వేరుగా కనిపిస్తున్న ప్పటికీ నిజానికి ఇది ఒకటే సంస్థ. తొలుత  ‘గ్లోబరేనా’ పేరుతో చలామణీ అయినా సంస్థ, ౨౦౧౯లో తన పేరును ‘కోయెంప్’గా మార్చుకున్నది. ఇది హైదరాబాద్ కేంద్రంగా నడిచే ప్రైవేట్ సాంకేతిక సంస్థ. ఈ డిజిటల్ మూల్యాంకనం, ఆన్ -స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం), పరీక్షల నిర్వహణఫై సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసి ప్రభుత్వాలకు అందించడం ఈ కంపెనీ పని.

సంస్థ కాంట్రాక్టుల ద్వారా సాఫ్ట్‌వేర్ రూపకల్పన పనులు చేపడుతుంది. అయి తే.. సంస్థ రూపొందించిన అనేక సాఫ్ట్‌వేర్స్ ఘోర వైఫల్యం చెందాయి. 2019లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యంతోపాటు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 2026 బోర్డు పరీక్షల ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) వివాదం వెనుక ఈ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్స్ ఉండటం వివాదాస్పదమైంది. 

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలక పరీక్షలకు ఇలాంటి వివాదాస్పద సంస్థకు కాంట్రాక్ట్‌లు అప్పగించడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవు తున్నది. అనేక దిగ్గజ ఐటీ కంపెనీలను పక్కనపెట్టి మరీ.. ప్రభుత్వాలు ఈ సంస్థకు సాఫ్ట్‌వేర్ బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తున్నది. ప్రభుత్వ విద్యా బోర్డులు టెండర్ల ప్రక్రియలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘోర తప్పిదాలకు ఆస్కారం ఏర్పడింది.

2000 సంవత్సరంలో హైదరాబాద్ కేం ద్రంగా ‘గ్లోబరేనా ఐటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభమైంది. సంస్థ 2019లో తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ప్రాసెసింగ్, ఫలితాల వెల్లడి బాధ్యతలను గ్లోబరేనా సంస్థకు అప్పగించింది. పరీక్షల ఫలితాలు విడుదలయ్యాక సంస్థ డొల్లతనం బయటపడింది.రాష్ట్రవ్యాప్తంగా 9.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో ఏకంగా 3.8 లక్షల మంది ఫెయిల్ అయినట్లు ఫలితాలు బయటకొచ్చాయి.

కొందరైతే అసలు పరీక్షలకే హాజరు కానట్లు ఫలితాల్లో రాసి ఉండటం విద్యార్థుల్లో అయోమయానికి గురి చేసింది. అలాగే, ప్రతిభావంతులైన విద్యార్థులకు సైతం సింగిల్ డిజిట్ మార్కులు రావడం కలకలం రేపింది. దీనిక వెనుక అసలు కారణం సాంకేతిక తప్పిదాలైనప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మానసిక వేదనకు గురై తెలంగాణవ్యాప్తంగా సుమారు 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి మరణాలు నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

నాటి ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయపరంగానూ ఈ విషయం పెను తుఫాను సృష్టించింది. ఉదంతంపై నాటి తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఫలితాల ప్రక్రియ ముగిసే సమయానికి కూడా ఇంటర్ బోర్డుకు, గ్లోబరేనా సంస్థకు మధ్య అసలు కాంట్రాక్టే లేదని కమిటీ గుర్తించింది. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే, ప్రభుతవ అంతపెద్ద బాధ్యతలను సంస్థకు అప్పగించడాన్ని తప్పుబట్టింది. ఈ పరిణామం జరిగిన ఆరు నెలల లోనే సదరు సంస్థ తన పేరును ‘కోయెంప్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ అని మార్చుకుంది.

సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎంలోనూ అవే లోపాలు..

సంస్థ పేరు మారినా యాజమాన్యం మాత్రం పాతదే. అలాగే, కీలక అధికారులూ పాతవారే. తెలంగాణ వివాద సమయంలో గ్లోబరేనా సీఈవోగా వీఎస్‌ఎన్ రాజు ఈ కొత్త కంపెనీకీ సీఈవోగా, డైరెక్టర్‌గా కొనసాగారు. తమ సంస్థపై తెలంగాణ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు పరిధిలోని కేసుల్లో తమకు క్లీన్ చిట్ లభించిందని సంస్థ యాజమాన్యం సమర్థించుకుంటునన్నది. పేరు మార్చినప్పటికీ ఈ సంస్థ ఈ లెర్నింగ్, డిజిటల్ ఎవల్యూషన్, ఆన్ -స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) రంగాల్లోనే పాత క్లయింట్ల రెఫరెన్సులతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది.

ఈ సంస్థ తాజాగా జాతీయ స్థాయిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బోర్డు పరీక్షల ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) బాధ్యతలు చేపట్టింది. ఈనెల ౧౩న విడుదలైన ౧౨వ తరగతి పరీక్షా ఫలితాల్లో మళ్లీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో చోటుచేసుకున్న తప్పులే పునరావృతమయ్యాయి. ఆన్‌లైన్ మూల్యాంకనంలో విద్యార్థుల జవాబు పత్రాల అప్‌లోడ్ ప్రక్రియ అస్తవ్యస్తమని తేలింది.

కొందరు విద్యార్థులవైతే ఏకంగా, జవాబు పత్రాలే కనిపించకపోవడం.. ఒకరి జవాబు పత్రాలు మరొకరికి మారిపోవడం.. వంటి ఇంకెన్నో వైఫల్యాలు బయటపడ్డాయి. రీ వాల్యుయేషన్ పోర్టల్ కూడా సాంకేతిక లోపాలతోనే ఉందని విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి.. ఈ వివాదం రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన సంస్థకే మళ్లీ, సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం కాంట్రాక్ట్ ఎలా అప్పగిస్తారని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని, అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

సీబీఎస్‌ఈ వివరణ..

ఓఎస్‌ఎం వివాదంపై వస్తున్న ఆరోపణలపై తాజాగా సీబీఎస్‌ఈ స్పందించింది. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారమే ‘కోయెంప్’కు టెండర్ల ద్వారా ఓఎస్‌ఎం బాధ్యతలు అప్పగించామని స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్‌పై కేవలం దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచే ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంది. లోపాలను సవరించేందుకు ఇప్పటికే ఐఐటీ నిపుణులను రంగంలోకి దించామని తెలిపింది.

మరోవైపు, కోయంప్ సంస్థ స్పందిస్తూ.. ఓఎస్‌ఎం ప్రక్రియలో తలెత్తినవి చాలా చిన్న సమస్యలని, మూల్యాంకన ప్రక్రియలో మానవ తప్పిదాల వల్లే ఇలాంటి ఈ లోపాలకు ఆస్కారం ఏర్పడిందని తెలిపింది. నీట్ యూ-జీ పేపర్ లీకేజీ వివాదంతో కోయంప్ సంస్థకు నేరుగా భాగస్వామ్యం లేదు. నీట్ బాధ్యతలను పూర్తిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే)నే పర్యవేక్షిస్తున్నది. అయితే.. వరుసగా పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కుల అక్రమాలు, ఫలితాల తారుమారుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఎన్డీయేపై తాజాగా సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అందుకు అవసరమైతే ఒక శాశ్వత నిపుణుల వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణ లోపాలపై కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణ ఇచ్చారు.

పరీక్షల వ్యవస్థను సంస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, స్వయంగా ప్రధాని వాటిని పర్యవేక్షిస్తున్నారని సమాధానమిచ్చారు. అలాగే, నీట్ సంస్కరణలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ చీఫ్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ సైతం కోర్టుకు కీలక వివరాలు అందించారు. కమిటీ సూచించిన 35 దీర్ఘకాలిక, 60 స్వల్పకాలిక సిఫార్సుల్లో చాలావరకు క్షేత్రస్థాయిలో అమలు చేశామని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఒకటి రెండు సమస్యలు తప్ప, పెద్దగా నిర్వహణ లోపాలేవీ చోటు చేసుకోలేదని తెలిపారు.