18-02-2026 10:10:15 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ,(విజయక్రాంతి): పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పరీక్షా సమయానికి ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, అందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.పరీక్షా సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 52 సెంటర్లలో మొదటి సంవత్సరం విద్యార్థులు 18,590 మంది పరీక్షలు రాయడం జరుగుతుందని, అదేవిధంగా20004 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం పరీక్షలు రాయడం జరుగుతుందని పేర్కొన్నారు.
అందుకుగాను పరీక్షా కేంద్రాలలో శానిటేషన్, త్రాగునీరు,తదితర సదుపాయాలు కల్పించడంతోపాటు ప్రతి సెంటర్లో రెండు నుంచి మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి సెల్ ఫోన్లు అనుమతించబడవని అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం ఫ్లయింగ్ స్క్యాడ్ పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
పరీక్ష సమయానికి ముందు కస్టోడియన్ అధికారులు పోలీసు వారి సహకారంతో పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలు పంపడం జరుగుతుందని అన్నారు. మార్చి 14 నుండి నిర్వహించే ఎస్ ఎస్ సి వార్షిక పరీక్షలకు జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు జరిగిందని 12 079 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలు మౌలిక వసతులు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ డిఐఈఓ బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.