29 August, 2026 | 7:11 PM

భద్రాచలం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ఎన్నికల నగారా

29-08-2026 06:32 PM

ఆగస్టు 31లోపు సభ్యత్వాల నమోదు తప్పనిసరి అడ్వైజర్ కమిటీ వెల్లడి

​భద్రాచలం, (విజయ క్రాంతి): భద్రాచలం పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అడ్వైజర్ కమిటీ ప్రతినిధులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యాపారుల ఐక్యత, సంక్షేమం మరియు రాబోయే నూతన కార్యవర్గ ఎన్నికల విధివిధానాలపై వారు సమగ్రంగా మాట్లాడారు. సభ్యత్వాలకు  ఆగస్టు 31 తుది గడువు అని  పట్టణంలో వ్యాపారాలు, వివిధ రకాల దుకాణాలు నిర్వహించే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తప్పనిసరిగా చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యత్వం తీసుకోవాలని కమిటీ పిలుపునిచ్చింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోందని, దీనికి ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఎలాంటి కొత్త సభ్యత్వాల దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపారు .

వ్యాపార రంగంలో పారదర్శకత, ఐక్యతను కాపాడటానికి ప్రతి ఒక్క దుకాణదారుడు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. సభ్యత్వాల పరిశీలన  ఆగస్టు  31తో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే, వచ్చిన దరఖాస్తులన్నింటినీ అడ్వైజర్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అర్హులైన సభ్యుల జాబితాను ఖరారు చేసిన అనంతరం, సెప్టెంబర్ నెలలో ఎన్నికల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. 

పూర్తి పారదర్శకతతో ఎన్నికల ప్రక్రియ

ఈసారి చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తామని కమిటీ స్పష్టం చేసింది. కమిటీ బాధ్యతలు చేపట్టేందుకు చాలామంది వ్యాపార ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారని, పోటీలో నిలబడే అభ్యర్థుల అర్హతలను నిబంధనల ప్రకారం పరిశీలించిన తర్వాతే బరిలో ఉండేందుకు అనుమతిస్తామని తెలిపారు.

అర్హులైన వ్యాపారస్తులందరి సమక్షంలో, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించి సమర్థవంతమైన నూతన చాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీని ఎన్నుకుంటామని కమిటీ సభ్యులు వెల్లడించారు. పట్టణ వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం, అభివృద్ధికి బలమైన వేదికను నిర్మించేందుకు ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అడ్వైజర్ కమిటీ కోరింది.  ఈ అధికృత కమిటీ సభ్యులు యశోద రాంబాబు, ఎజ్జాడ   బాబ్జి . తాండ్ర రమణారావు, ఎస్ కే టి రాము. చల్లగుల్ల నాగేశ్వరరావు, ఎస్ కే సలీం  పాల్గొన్నారు.