జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పనులు పకడ్బందీగా చేపట్టాలి
జైపూర్, (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం కుందారం గ్రామ పంచాయతీలో జలసిరి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పంట కుంట పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ నీటిమట్టాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. పంట కుంట పనులలో పాటించాల్సిన జాగ్రత్తలు, పనుల పురోగతి అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని తెలిపారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులతో పాటు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించి, ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన వ్యక్తులు సంబంధిత స్థాయి అధికారులను సంప్రదించి అవసరమైన వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, టి.ఎ., క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






