calender_icon.png 6 December, 2024 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌లో స్టార్ హోటళ్ల నిర్మాణం

02-11-2024 03:02:43 AM

త్వరలో వాటర్ స్పోర్ట్స్.. 

పీపీపీ విధానంలో అభివృద్ధి పనులు 

రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నల్లగొండ, నవంబర్ 1 (విజయక్రాంతి)/ హైదరాబాద్:  నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో స్టార్ హోటళ్లు నిర్మిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డితో కలిసి బుద్ధవనాన్ని సందర్శించి మాట్లాడారు. దేశ విదేశాల నుంచి వచ్చే బౌద్ధులు, పర్యాటకులకు ఇబ్బంది లేకుండా బుద్ధవనంలో సలక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సాగర్ రిజర్వాయర్‌లో త్వరలో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభిస్తామన్నారు. అన్నివర్గాలకు అందుబాటులో ఉండేలా కాటేజీలను సైతం నిర్మిస్తామన్నారు. సాగర్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బుద్ధవనం, విజయ విహార్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి ఇవ్వాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌ను మంత్రి ఆదేశించారు. అంతకుముందు  రామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు కమలేష్ డీ పటేల్ (దాజీ)తో కలిసి విపస్యన ధ్యాన కేంద్రాన్ని పరిశీలించారు. పర్యటనలో టీజీటీడీసీ ఎండీ ప్రకాష్‌రెడ్డి, బుద్ధవనం కన్సల్టెంట్ శివనాగిరెడ్డి, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, డిజైనర్ శ్యాంసుందర్ ఉన్నారు. 

నేటి నుంచి నాగార్జున సాగర్ శ్రీశైలం లాంచీ సేవలు 

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి శనివారం నుంచి లాంచీ సేవలు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకృతి ప్రేమికులు నల్లమల అందాలను వీక్షిస్తూ.. కృష్ణా నదిలో విహరిస్తూ శ్రీశైలానికి చేరుకునేలా టూర్ ప్లాన్ ఉంటుందన్నారు. ఇప్పటికే సోమశీల శ్రీశైలం లాంచీ సేవలు సైతం ప్రారంభమయ్యాయన్నారు. టూరిస్టులు టూర్ ప్యాకేజీ వివరాలు, బుకింగ్స్ కోసం https://tourism.telangana.gov.in/   వెబ్ సైట్‌ను సందర్శించాలని కోరారు. సింగిల్ జర్నీలో పెద్దలకు రూ.2 లు, చిన్నారులకు రూ.1600, రానుపోను పెద్దలకు రూ.3 లు, చిన్నారులకు 2400గా నిర్ణయించినట్లు తెలిపారు.