ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర సర్కార్ విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
జగిత్యాల, మే 23 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో వందకు వందశాతం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన బీఆర్‌ఎస్ నేతలతో కలిసి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొనుగోళ్లు ఆలస్యమవుతున్నందున కొన్నిచోట్ల ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్ద అయిన ధాన్యం మొలకొత్తే స్థితికి వచ్చిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారన్నారు. అధికారులు ఏమాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం దారణమన్నారు. తడిసిన ధాన్యాన్నీ కొంటామని మీడియాలో ప్రచారం చేస్తున్నదని, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.






