ఆన్ ఆఫ్ స్విచ్‌కు రూ. 4వేలు
లైన్‌మెన్ నిర్లక్ష్యంతో మూడు గ్రామాలకు కరెంట్ కష్టాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఏఈ
సిద్దిపేట అర్భన్, మే 23 : ఆన్‌ఆఫ్ స్విచ్ మరమ్మతుకు గ్రామం లైన్‌మెన్ రూ. 4వేలు డిమాండ్ చేస్తున్నాడు. ఒక లైన్‌మెన్ నిర్లక్ష్యం వల్ల మూడు గ్రామాలకు కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయి. విషయాన్ని మండల విద్యుత్ శాఖ అధికారికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో ట్రాన్స్‌ఫర్మర్ ఫైన ఆన్ ఆఫ్ స్విచ్ పది నెలలుగా పనిచేయడం లేదు. మరమ్మతులు చేయాల్సిందిగా స్థానిక రైతులు విద్యుత్ శాఖ అధికారులను కోరిన ఫలితం శూన్యం. వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మరమ్మతులు చేయాల్సి వస్తే ట్రాన్స్‌ఫర్మర్ వద్ద ఆఫ్ చేసుకునే సౌకర్యం లేదు.
వెల్కటూర్ గ్రామంలోని విద్యుత్ ఉప కేంద్రంలో ఎల్‌సీ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో ఒక ట్రాన్స్‌ఫర్మర్‌పై మరమ్మతు చేయాల్సి వస్తే సుమారు మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఆన్ ఆఫ్ స్విచ్ రిపేర్ చేయాల్సిందిగా గ్రామం లైన్‌మెన్‌ను కోరగా తనకు కొంత డబ్బు ఇస్తేనే సామగ్రి తెచ్చి మరమ్మతు చేస్తానని చెప్పాడు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించలేరు.
దీంతో రైతులు తలోకొంత డబ్బు పోగుచేసుకుని స్విచ్‌కు అవసరమైన సామగ్రిని తెచ్చారు. అవి బిగించాల్సిందిగా సంబంధిత మండల విద్యుత్ శాఖ అధికారికి విజ్ఞప్తి చేశారు. తనకేం తేలియదు మీ గ్రామం లైన్‌మెన్‌తో మరమ్మతులు చేయించుకోవాలని సదరు అధికారి ఉచిత సలహా ఇచ్చారు. కానీ లైన్‌మెన్ మాత్రం రూ. 4వేలు ఇస్తే తప్ప ఆన్‌ఆఫ్ స్విచ్ బిగించలేనని డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయమై గ్రామం రైతులు ‘విజయక్రాంతి’కి వివరించారు. సిద్దిపేట డివిజన్ విద్యుత్ శాఖ అధికారిని విజయక్రాంతి వివరణ కోరగ తాను సమావేశంలో ఉన్నానని, మండలం ఏఈని మాత్రమే సంప్రదించాలని సూచించారు.






