calender_icon.png 8 October, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట

08-10-2025 01:18:18 AM

  1. స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ 
  2. హైకోర్టు బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందుకు జోక్యం చేసుకోలేమని వెల్లడి 
  3. డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని వెల్లడి

ఢిల్లీ, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నియామకా లపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరిం చింది. ఈ నియామకాలపై హైకోర్టు బెంచ్ మధ్యంతర తీర్పు వెలువరించినందున ఈ దశలో జోక్యం చేసు కోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని తేల్చి చెప్పింది.

గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడంపై స్టే విధించాలని వాకు కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్జిల ధర్మాసనం విచారణ జరిపింది.

సింగల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం పైనా అభ్యర్థుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. వాదనల అనంతరం స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన పిటిషన్లన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఈ నెల 15న విచారణకు రానున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. 

ఈ లోగా చేపట్టిన నియామకాలన్నీ రిట్ అప్పిల్స్‌పై ఇచ్చే ఫలితానికి లోబడి ఉంటాయని, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. అవకాశం ఉన్నంత త్వరగా పిటిషన్లపై విచారణ ముగించి తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనం సూచించింది. ఈ కేసుకు ప్రాధాన్యత ఇచ్చి విచారణ పూర్తి చేయాలని సూచిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణను ధర్మాసనం ముగించింది.