కోమట్లగూడెం పీహెచ్‌సీకి రాష్ట్రస్థాయి పురస్కారం
మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉత్తమ వైద్య సేవలందించినందుకు మహబూబాబాద్ జిల్లా కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కామారం హెల్త్ సబ్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పురస్కారాన్ని అందుకుంది.
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్త్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు ను కోమట్ల గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కామారం హెల్త్ సబ్ సెంటర్ కు చెందిన ఎమ్మెల్ హెచ్ పీ వెంకటేష్, ఏఎన్‌ఎం లు మల్లేశ్వరి, వెంకటలక్ష్మి హెల్త్ అసిస్టెంట్ వీరస్వామి అందుకున్నారు. గర్భిణీ స్త్రీల ముందస్తు నమోదు, నాలుగు తప్పనిసరి ఏ ఎన్ సీ పరీక్షలు, పూర్తి రోగనిరోధక టీకాలు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కామారం సబ్ సెంటర్ చూపిన విశిష్ట ప్రతిభకు గుర్తింపుగా లభించింది.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ కామారం సబ్ సెంటర్ సిబ్బందిని అభినందించి, వారి కృషి ఇతర ఆరోగ్య కేంద్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తల్లి-శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో సిబ్బంది నిబద్ధత ప్రశంసనీయమని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మరియు సంబంధిత సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలను కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి మరింతగా తోడ్పడాలని ఆకాంక్షించారు.




