పర్యాటక అభివృద్ధికి రామప్ప ఆలయం కీలకం
మూసీ కార్పొరేషన్ ఎం.డి నరసింహ రెడ్డి
వెంకటాపూర్, ఏప్రిల్ 07 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని మంగళవారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ.వి నరసింహ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు హరీష్ శర్మ, ఉమ శంకర్ కుంభ స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ విజయ్ ద్వారా ఆలయ చరిత్ర, కాకతీయుల కాలానికి చెందిన విశిష్టతల గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈ.వి నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ కట్టడంగా పేరుగాంచిన రామప్ప దేవాలయం శిల్పకళా వైభవం అపూర్వమని, కాకతీయుల ప్రతిభకు ఇది నిదర్శనమని, ఈ దేవాలయాన్ని దేశ విదేశాల పర్యాటకులకు మరింతగా చేరువ చేయాల్సిన అవసరం ఉందని, పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, రాబోయే తరాలకు ఈ వారసత్వాన్ని అందించడం మన బాధ్యత అని అన్నారు. వారి వెంట ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య, స్థానిక తహసీల్దార్ గిరిబాబు, ఆర్‌ఐ రమేష్, టూరిస్ట్ పోలీస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




