కశ్మీర్‌కు స్టేట్ హోదా
ఎన్నికల్లో అదే మా ప్రధాన హామీ
ఎన్సీతో ఎన్నికల పొత్తుకు ఓకే
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 22: జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించటమే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ప్రధాన ఎజెండా అని కాంగ్రెస్ పార్టీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ తెలిపారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు చేసుకొంటున్న ఆయన.. రాజకీయ పొత్తులపై స్పందించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీతో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై వీరు చర్చలు జరిపారు. అనంతరం గురువారం శ్రీనగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘ఇండియా కూటమితోపాటు మా ప్రాధాన్యం వీలైనంత త్వరగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా తీసుకురావటమే. ఎన్నికల ముందే రాష్ట్ర హోదా వస్తుందని ప్రతిపక్షాలన్నీ ఆశించాయి. కానీ కేంద్రం ఇవ్వలేదు. మరేం పర్లేదు.. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన రావటం సంతోషమే. జమ్ముకశ్మీర్, లఢక్‌కు తమ ప్రజాస్వామిక హక్కులు తిరిగి పొందేందుకు మేం కృషి చేస్తాం’ అని వెల్లడించారు. కశ్మీర్‌తో తనకు రక్తసంబంధం ఉన్నదని రాహుల్‌గాంధీ గుర్తుచేశారు. ఆయన ముత్తాత మోతీలాల్ నెహ్రూది జమ్ముకశ్మీర్ ప్రాంతమే.






