23 April, 2026 | 7:26 AM

టీవీకే పార్టీ లోగో ఆవిష్కరణ

23-08-2024 12:10 AM
  1. జోరుగా నటుడు విజయ్ కొత్త పార్టీ పనులు
  2. తమిళగ వెట్రి కళగం పార్టీ జెండా, లోగో విడుదల

చెన్నై, ఆగస్టు 22: ప్రముఖ తమిళ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) వ్యవస్థాపకుడు విజయ్ తన పార్టీ జెండా, లోగోలను గురువారం ఆవిష్కరించారు.  ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఆయన కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటన చేసి పార్టీ పేరును కూడా వెల్లడించారు. గురువారం ఏర్పాటుచేసిన పార్టీ రాష్ట్ర కన్వెన్షన్‌లో జెండాను, లోగోను ఆ విష్కరించారు. పార్టీ గీతాన్ని టీవీకే సోషల్‌మీడియా విభాగం విడుదల చేసింది. టీవీకే జెండాలో పైభాగం, కింది భాగం ముదురు ఎరుపు రంగులో మధ్యన పసుపు రంగులో ఉన్నది.

పసుపు రంగు భాగంలో రెండు ఏనుగులు, వాటి మధ్యన వాగై పుష్పం ముద్రించారు. ఈ గుర్తు విజయానికి సంకేతంగా తమిళనాడులో భావిస్తారు. తమ పార్టీకి సామాజిక న్యాయమే ఎజెండా అని విజయ్ ప్రకటించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ‘మన లక్ష్యం 2026 ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం.. ప్రజలు కోరుకొంటున్నట్టు రాజకీయాల్లో ప్రాథమిక స్థాయి నుంచి మార్పులు తీసుకురావటం’ అని ప్రకటించారు.