5 August, 2026 | 1:54 AM

సుంకాలపై కోర్టుకు 25 రాష్ట్రాలు

05-08-2026 12:28 AM

ట్రంప్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు

వాషింగ్టన్, ఆగస్టు 4: ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన సుంకాల నిర్ణయంపై 25 రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి యూఎస్‌సీఓఐటీ (యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్)లో పిటిషన్ దాఖలు చేసింది. అమెరికా దిగుమతులలో 99.4 శాతం వాటా కలిగిన 60 దేశాల ఆర్థిక వ్యవస్థలపై సుంకాలు విధించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు కావడంతో ట్రంప్‌కు కొత్త సవాలు ఎదురైనట్లయ్యింది.

ఈ సుంకాల వల్ల వినియోగదారులు, వ్యాపారాలపై భారీ భారం పడుతుందని పేర్కొన్నాయి.  ప్రస్తుతం ‘ట్రంప్ టారిఫ్’ నిర్ణయంపై తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయా రాష్ట్రాలు, దేశాలు భావిస్తున్నాయి. అయితే వెట్టిచాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10 శాతానికి తగ్గించారు. 12.5 శాతం టారిఫ్ విధించాలని గతంలో ప్రతిపాదించారు.

చమురు, సహజవాయువు, ఎరువుల దిగుమతులకు, యూఎస్, మెక్సికో, కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులకు ఈ పన్నుల నుంచి మినహాయింపునిచ్చారు. కాగా సుంకాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్, గవర్నర్ క్యాథీ హోచుల్‌లు డిమాండ్ చేశారు. ట్రంప్ కుటుంబం వ్యాపారాలను పెంచుకునేందుకే చట్టవిరుద్ధంగా పన్నులను విధిస్తోందని ఆరోపించారు. సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, అమెరికా రాజ్యాంగం స్పష్టంగా చెబుతుందని పేర్కొన్నారు.