2 September, 2026 | 4:16 AM

‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’పై స్టే ఎత్తివేత

02-09-2026 | 01:02am
  1. ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
  2. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కల్యాణలక్ష్మి(Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాల(Shaadi Mubarak schemes)పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఈ రెండు పథకాల అమలుపై సింగిల్ బెంచ్(single bench) విధించిన స్టేను చీఫ్ జస్టిస్(Chief Justice) నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. పథకాలపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

ఈ పథకాల నిమిత్తం ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన 8 జీవోలను సవాల్‌చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకాలు 2014 నుంచి అమల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఈ పథకాల అమలు వల్ల పిటిషనర్‌పై ఎలాంటి ప్రభావం చూపడంలేదని, అతని హక్కులకూ భంగం వాటిల్లలేదన్నారు. అంతేకాకుండా పిటిషనర్ పథకాల లబ్ధిదారు కూడా కాదన్నారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని పేర్కొన్నారు. షాదీ ముబారక్ లాంటి పథకాన్ని సుప్రీంకోర్టు అనుమతించిందని, అలాంటిదే కల్యాణలక్ష్మి పథకమన్నారు.

ఈ పిటిషన్ సింగిల్ జడ్జి వద్ద విచారణార్హం కాదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించే పరిధి ఈ డివిజన్ బెంచ్‌కు ఉందన్నారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.