13-12-2025 12:00:00 AM
సూర్యాపేట, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : గ్రామపంచాయతీ ఎన్నికలు మిగతా ఎన్నికలకు చాలా భిన్నంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రాధాన్యత కలిగినవి కూడా. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అనగానే మామూలు పోటీ ఉండదు. ఇది కేవలం పదవి మాత్రమే కాదు.. అత్యంత కీలకమైన బాధ్యత.
అయితే ఆ పదవికి పోటీ పడేవారికి గెలవడం ఒక్కటే లక్ష్యం అనుకుంటే పొరపాటే.. కారణం గెలవడానికి అయ్యే ఖర్చులు లక్షల రూపాయల్లో ఉంటాయి. దీంతో వారికి ఎదురయ్యే ఆర్ధిక పరమైన ఒత్తిరులు, అభివృద్ధి చేసేందుకు పడే కష్టాలు భరించడం కష్టతరంగా ఉంటాయి. అందుకే నిపుణులు సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థులకు బరిలో నిలిచారా జర భద్రం అని సూచిస్తున్నారు.
ఓటుకు నోటైతే కష్టమే..
సర్పంచ్ పోటీలో నిలిచిన అభ్యర్థులు గెలవడం కోసం ఓటర్లకు డబ్బులు, మద్యం, కానుకలు వంటివి ఇస్తుంటారు. దీనివల్ల అనధికారికంగా ఎన్నికల ఖర్చు తడిసి ముప్పందుము అవుతుంది. పోటిలో నిలిచి ఓడిపోతే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఎలాగైనా గెలవాలని ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఎదుటి వారి కన్నా ఎక్కువ ఇవ్వాలని శక్తికి మించి ఖర్చులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అందుకే ఓటుకు నోటైతే కష్టమేనని సామాజికవేత్తలు చెబుతున్నారు.
పదవి కాదు అప్పుల ఊబి..
ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు పూర్తికాగా రెండో విడతకు సైతం ప్రచారం ముగిసింది. ఈ సమయంలో మొదటి విడతలో పోటీలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులు చిన్న పంచాయితీలు అయితే రూ.10 _15 లక్షలు, పెద్దవి అయితే రూ.30 _40 లక్షలు దాటినట్లు తెలుస్తుంది. పోటీలో నిలిచి ఓడిన వారి బాధలు దేవుడికి ఎరుక. అదే గెలిచిన వారు సైతం ఈ అప్పులు ఎలా తీర్చాలి అని తమలో తామే మదన పడుతున్నారని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా గతంలో ఎన్నో గ్రామాల్లో సర్పంచులు తమ సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి రోడ్లు, లైట్లు వేయించారు.
కాలువలు, భవనాలు నిర్మించారు. బిల్లులు రాక అప్పులు పేరుకుపోయి ఇబ్బందులు పడిన సంఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక్కో సర్పంచ్ సుమారు రూ.50 లక్షల వరకు సొంతంగా ఖర్చు పెట్టి పనులు చేయించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ అప్పుల భారం భరించలేక, ఆత్మహత్యకు దిగిన ఘటనలు కూడా నమోదయ్యాయి. అదుకే ఇది పదవి కాదు అప్పుల ఊబి అనే విషయం మరిచిపోవద్దని, పదవి వ్యామోహంతో జీవితాలు ఆగం చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఇతరుల పెత్తనంతో ఇబ్బందులు..
ఎన్ని చట్టాలు వచ్చినా గ్రామాల్లో ఇంకా పెత్తందారీ కులాలదే పై చేయి అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు సర్పంచ్ లు అయితే అగ్రకులాల వారే పెత్తనాలు చెలాయిస్తున్నారనే అభియోగాలు ఉనాయి. దీంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలిచినా వారి ముందు నోరు మెదపకుండా కూర్చుంటున్న సందర్భాలను చూస్తున్నాం. తెర వెనుక నుండి ఇప్పటికీ పెత్తందారులు నడిపిస్తున్నారు. అందుకే ఇతరుల పెత్తనాలతోనూ ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నందున బరిలో నిలిచిన వారు జర భద్రం అని ఆర్థిక నిపుణులు, సామాజిక వేత్తలు, మేధావులు సూచిస్తున్నారు.
మార్పుకు నాంది కావాలి..
ఇప్పటికే మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాగా రేపు రెండో విడత, ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికైనా గ్రామా ల్లోని యువతీ, యువకులు, మహిళలు అందరూ ఆలో చించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులు ఇచ్చే క్వార్టర్ కో, బిర్యాని ప్యాకెట్ లకో, కరెన్సీ నోట్లకో.. అమ్ముడు పోకుండా విలువలు ఉన్న వాడా.. చదువుకున్నావాడా.. అభివృద్ధి చేసే సామర్థ్యం ఉందా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి సరైన వ్యక్తిని సర్పంచిగా ఎన్నుకోవాలని కోరుకుందాం..