18-02-2026 11:10:52 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 18, (విజయక్రాంతి): చెరుకు లోడ్‌తో వెళ్తున్న ఎడ్లబండ్లను కంటైనర్ ఢీకొంది. దీంతో రెండు ఎడ్లు మృతి చెందగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణ్ ఖేడ్‌కు చెందిన కూలీలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చెరుకు కొట్టడానికి వచ్చారు. ఈ క్రమంలో నాలుగు ఎడ్ల బండ్లపై చెరుకు లోడ్ చేసుకుని బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి బయలుదేరారు.
అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులోకి రాగానే కర్ణాటకకు చెందిన కంటైనర్ వేగంగా దూసుకువచ్చి ఎడ్ల బండ్లను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృతి చెందగా మరొక రెండు ఎడ్లకు తీవ్ర గాయలయ్యాయి. అలాగే ఓ వ్యక్తికి కూడా గాయలైనట్టుగా తెలుస్తోంది. అతన్ని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టుగా సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగే ఆస్కారమున్న ప్రాంతాల్లో రాత్రి, తెల్లవారుజామున వేగం తగ్గించి వెళ్లాలని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ భారీ వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.