రాజకీయ వైరితో అభివృద్ధికి ఉరి
ప్రొ.సంగని మల్లేశ్వర్ :
నేడు తెలంగాణకు ఎదురైన సమస్య రేపు తమిళనాడు, కేరళ, కర్ణాటక లేదా మరే ఇతర రాష్ట్రానికైనా ఎదురుకావచ్చు. ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగత పర్యటన సమస్య కాదు. రాష్ట్రాల హక్కులు, కేంద్రం బాధ్యతల మధ్య ఉన్న బంధానికి సంబంధించిన జాతీయ ప్రశ్న.
రాజకీయాల్లో విభేదాలు ఉండటం సహజం. ఎన్నికల వరకు ప్రత్యర్థులుగా పోరాడవచ్చు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజకీయ వైరాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రాల సంబంధాల్లో రాజకీయ పక్షపాతం కనిపిస్తే, అది కేవలం ఒక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, భారత సమాఖ్య వ్యవస్థ పునాదులనే బలహీనపరచడం అవుతుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా పర్యటనకు వెళ్లాలనుకున్న సందర్భంలో కేంద్రం అనుమతి నిరాకరించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ ఉంది. ప్రపంచ పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించాలని ప్రయత్నించడం తప్పా? పెట్టుబడుల కోసం ప్రపంచంతో పోటీ పడుతున్న రాష్ట్రానికి సహకరించాల్సిన కేంద్రం ఎందుకు అడ్డంకిగా మారిందో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.
ఇది కేవ లం ఒక విదేశీ పర్యటనకు సంబంధించిన పరిపాలనా అంశంతో ముడిపడిలేదు. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో చేసే అభివృద్ధితో ముడిపడి ఉంది. కాంగ్రెస్, బీజేపీ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ పార్టీలకతీతంగా కేవలం అభివృద్ధిని ఆకాంక్షించి రేవంత్ నాడు మోదీని పెద్దన్నగా సంభోదించారు. కానీ, నేడు బీజేపీయేతర ప్రభుత్వాలపై ఎలాంటి కుట్రలు దాగిఉన్నాయో రేవంత్‌కు అనుమతి ఇవ్వకపోవడం చూస్తే అర్థమవుతున్నది. కేంద్రం రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరిస్తోందా? అన్న మౌలిక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సందర్భం ఇది. అభివృద్ధి విషయంలో రాజకీయ వైరాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్యానికి హానికరం.
భారతదేశం బలమైన రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. తెలంగాణ కొత్త రాష్ట్రం పరిశ్రమలు, సాంకేతిక రంగం, సేవారంగం, మౌలిక వసతులు, గ్రామీణ అభివృద్ధి, ప్రతి రంగంలో ఇంకా భారీ పెట్టుబడులు అవసరం. లక్షలా ది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల కోసం ప్రపంచాన్ని చుట్టడం నేరం కాదు. పెట్టుబడులు తీసుకురావడం రాజకీయ పాపం కాదు.
యువతకు ఉద్యోగాలు కల్పించాలని ప్రయత్నించడం అధికార దుర్వినియోగం కాదు. కేవలం రాజకీయ ప్రత్యర్థి అధికారంలో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందితే తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందన్న భావనతో కేంద్రం వ్యవహరించింది, అది అత్యంత ప్రమాదకరమైన రాజకీయ ధోరణి. రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచి కేంద్ర రాజకీయాలను బలోపేతం చేయడం సమాఖ్యవాదం కాదు కదా? ఇది పూర్తిగా కేంద్రీకరణ ధోరణితో వ్యవహరించడమే అనే భావన అందరిలో ఉన్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 246తో పాటు ఏడవ షెడ్యూల్‌ను ప్రస్తావించి సీఎం పర్యటనను నియంత్రించవచ్చు. కానీ, పూర్తిగా రద్దు చేసే అవకాశం లేదు. బీజేపీ అధికారం లో ఉన్న గుజరాత్ సీఎం అమెరికా, కెనడా కు వెళ్తే కేంద్రం అనుమతించింది. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వాటిని పెట్టుబడుల వేటగా బీజేపీ ప్రచారం చేస్తుంది. అదే పని కాంగ్రెస్ లేదా ఇతర ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు చేస్తే అనుమతుల పేరుతో అడ్డంకులు ఎం దుకు సృష్టిస్తున్నారు? అందరికీ ఒకే నిబంధన, ఒకే ప్రమాణం ఉండాలి.
అదే రాజ్యాంగబద్ధ పాలన, ఢిల్లీ రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం దేశభక్తి కాదు. అది రాజకీయ సంకుచితత్వం. బీజేపీ తరచూ సహకార సమాఖ్యవాదం గురించి మాట్లాడుతుంది. కానీ, మాటల్లో సహకారం, చేతల్లో నియంత్రణ ఉంటే దాన్ని సమాఖ్య స్ఫూర్తి అనలేం. రాష్ట్రాలకు సహకరించాల్సిన కేంద్రం, వాటి ఆర్థిక ప్రయత్నాలపై అనుమానపు నీడ వేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
విదేశీ పర్యటనలకు భద్రత, దౌత్య సంబంధాలు, ప్రొటోకాల్ వంటి నిబంధనలు ఉండ టం సహజమే. ప్రతి అనుమతి నిరాకరణ ను రాజకీయ కుట్రగా చూడాల్సిన అవసరం లేదు. కానీ, అనుమతి ఇవ్వకపోతే, అందుకు స్పష్టమైన కారణాన్ని ప్రజలకు తెలియజేయాలి. కారణం వెల్లడించకుండా అనుమ తి లేదని చెప్పడం పారదర్శక పరిపాలన కాదు. ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి అనుమానాలకు తావివ్వకుండా కేంద్రం పూర్తి స్పష్టత ఇవ్వాలి.
భారతదేశం ఒకే కేంద్రం ఆధీనంలో నడిచే వ్యవస్థ కాదు. రాష్ట్రాలు రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలు. వాటికి ప్రజలు నేరుగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారాన్ని అప్పగిస్తారు. కేంద్రం రాష్ట్రాలపై అధికారం చెలాయించడానికి కాదు; రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో సమన్వయంతో పనిచేయడానికి ఉంది. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, ఆర్థిక స్వేచ్ఛ, పరిపాలనా స్వయంప్రతిపత్తి క్రమంగా క్షీణిస్తే, భారత సమాఖ్య నిర్మాణమే బలహీనపడుతుంది.
నేడు తెలంగాణకు ఎదురైన సమస్య రేపు తమిళనాడు, కేరళ, కర్ణాటక లేదా మరే ఇతర రాష్ట్రానికైనా ఎదురుకావచ్చు. ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగత పర్యటన సమస్య కాదు. రాష్ట్రాల హక్కులు, కేంద్రం బాధ్యతల మధ్య ఉన్న బంధానికి సంబంధించిన జాతీయ ప్రశ్న. గత కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో రాజకీయ ఉద్రిక్తత పెరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. నిధుల పంపిణీ, జీఎస్టీ వాటాలు, కేంద్ర పథకాల అమలు, రాష్ట్రాల అప్పుల పరిమితులు, ఇప్పటికే గవర్నర్ వ్యవస్థ వంటి అంశాల్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రంపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
కేవలం పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతున్న న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీని కలిసేందుకు ప్రయత్నించారనే ఆరోపణతో ప్రజాస్వామ్యంలో తలుపులు మూసి నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఆ నిర్ణయాలకు కారణాలు చెప్పడం బాధ్యత. రేవంత్ వెంటే ఉండే విదేశీ రాయబారులకు తెలియకుండా ఎవరినీ కలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిస్తే ఎక్కడ రేవంత్ గౌరవం పెరుగుతుందనే భావనతో అడ్డుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బీజేపీ పాలకులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రాలు శాశ్వతం. ప్రభుత్వాలు మారతాయి. రాజకీయ పార్టీలు మారతాయి. కానీ, సమాఖ్య వ్యవస్థ మాత్రం దేశ ఐక్యతకు శాశ్వ త పునాది. భారతదేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా ప్రకటిస్తోం ది.
కానీ, వికసిత్ భారత్ అంటే ఏమిటి? కేవలం ఢిల్లీని అభివృద్ధి చేయడమేనా? కేంద్ర ప్రభుత్వ భవనాలకు కొత్త రంగులు వేయడమేనా? విదేశాల్లో భారత ప్రతిష్ఠ గురించి గొప్పలు చెప్పుకోవడమేనా? లేక దేశంలోని ప్రతి రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించడమా? వికసిత్ భారత్ కావాలంటే దూరదృష్టి కావాలి.
రాజకీయ ప్రతీకారం కాదు, రాష్ట్రాల అభివృద్ధికి సహకారం కావాలి. కేంద్రీకరణ కాదు, సహకార సమాఖ్యవాదం కావాలి. తెలంగాణకు పెట్టుబడులు వస్తే, అది దేశానికి పెట్టుబడులు వచ్చినట్టు కాదా? తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తే భారత యువతకు ఉద్యోగాలు వచ్చినట్టు కాదా? తెలంగాణ జీడీపీ పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థ బలపడదా? ఒకవైపు అభివృద్ధికి రాజకీయాలు ఉండవు అంటారు. మరోవైపు ప్రతిపక్ష పాలిత రాష్ట్రం పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లాలంటే అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తారు.
ఇది ఏరకమైన అభివృద్ధి రాజకీయమో బీజేపీ చెప్పాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు పెట్టుబడుల యాత్ర లు.. కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై మాత్రం అనుమానాలు ఎందు కు? అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఒకే నిబంధన ఉండాలి. ఒకే ప్రమాణం ఉండాలి. లేకపోతే అది రాజ్యాంగబద్ధ పాలన కాదు, దానికి రాజకీయ రంగు పులమడమే, ప్రజల తీర్పును అవమానించడమే.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి, 9866255355






