27 August, 2026 | 1:59 AM

గణాంకాలతో సమానత్వానికి బాట

27-08-2026 12:00 AM

డా.ముచ్చుకోట సురేష్ బాబు :

దేశంలో సామాజిక న్యాయం, సమా న అవకాశాలు, సమతుల్య అభివృద్ధి సాధించాలంటే సమగ్ర కులగణన అత్యంత అవసరం. ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉంది? వారి విద్య, ఉపాధి, ఆర్థిక పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఏ మేరకు అందుతున్నాయి? రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు కచ్చితమైన గణాంకాలు లేకుండా సమర్థవంతమైన విధానాలను రూపొందించడం సాధ్యం కాదు.

అందువల్ల దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణ న సర్వే నిర్వహించేందుకు అసెంబ్లీలో తీర్మా నం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం రాష్ట్రం లో కులాలవారీగా జనాభా, ఆర్థిక పరిస్థితి, విద్య, ఉపాధి, సామాజిక స్థితిగతులు, సంక్షేమ పథకాల లబ్ధి తదితర అంశాలపై వివరాలను సేకరించింది.

ఈ గణాంకాలు సామాజిక న్యాయ విధానాల రూపకల్పనకు కీలక ఆధారంగా నిలుస్తాయి. అదే సమయంలో స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ కూడా సమగ్ర కులగణనను చేపట్టాలి. సమాజంలో కొన్ని ఆధిపత్య వర్గాలకు వారి జనాభా నిష్పత్తికి మించి అవకాశాలు లభిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు జనాభాలో గణనీయమైన వాటా కలిగిన బీసీ వర్గాలకు తగిన రాజకీయ ప్రాతిని ధ్యం లభించడం లేదనే ఆవేదన ఉంది.

ఈ అసమానతలను భావోద్వేగాల ఆధారంగా కాకుండా నమ్మదగిన గణాంకాల ఆధారంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. సమగ్ర కులగణన ద్వారా ఏ వర్గానికి ఎంత జనాభా ఉంది, విద్యారంగంలో వారి స్థానం ఏమిటి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత ప్రాతినిధ్యం ఉం ది, రాజకీయాల్లో వారి భాగస్వామ్యం ఎంత, ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉన్నారు? అనే అంశాలపై స్పష్టత వస్తుంది. తద్వారా అవసరమైన వర్గాలకు లక్షిత సంక్షేమ పథకాల ను రూపొందించేందుకు ప్రభుత్వాలకు అవకాశం కలుగుతుంది.

బీసీల ఐక్యతకు సమగ్ర కార్యాచరణ

బీసీ వర్గాలు అనేక కులాలు, ఉపకులాలుగా ఉన్నాయి. వారి సమస్యలు కూడా ప్రాంతం, వృత్తి, ఆర్థిక పరిస్థితి ఆధారంగా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులు, సంప్రదాయ చేతివృత్తులపై ఆధారపడిన వర్గాలు మరింత వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయి. అందువల్ల బీసీ వర్గాల్లో అంతర్గత ఐక్యతను పెంపొందించడంతో పాటు, అవకాశాల పంపిణీలో కూడా సమానత్వం ఉండాలి.

బీసీ సమాజంలోని ప్రతి కులం, ఉపకులానికి వారి జనాభా, వెనుకబాటుతనం, అవసరాలకు అనుగుణంగా అవకాశాలు అందేలా విధానాలు రూపొందించాలి. దీనికి సమగ్ర కులగణన ఒక బలమైన పునాది అవుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులు సంప్రదాయ కులవృత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యాంత్రీకరణ, కార్పొరేటీకరణ కారణంగా తరతరాలుగా వృత్తులపై ఆధారపడిన అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయి.

స్టీల్, ఇను ము పరిశ్రమల విస్తరణతో సంప్రదాయ కమ్మరి, వడ్రంగి వృత్తులపై ప్రభావం పడింది. ప్లాస్టిక్ ఉత్పత్తుల విస్తరణతో మేదరి, కుమ్మరి వృత్తులు దెబ్బతిన్నాయి. జేసీబీలు, హిటాచీ వంటి యంత్రాల వినియోగం పెరగడంతో వడ్డెర్లకు ఉపాధి అవకాశాలు తగ్గాయి.

సా మిల్లులు, రెడీమేడ్ దుస్తులు, బ్యూటీ పార్లర్లు, ఆధునిక సేవా రంగాలు కూడా సంప్రదాయ వృత్తుల స్వరూపాన్ని మార్చేశాయి. యాంత్రీకరణను అడ్డుకోవడం పరిష్కారం కాదు. యాంత్రీకరణ వల్ల జీవనోపాధి కోల్పోతున్న వర్గాలను కొత్త నైపుణ్యాలతో, ఆధునిక పరికరాలతో, రుణ సదుపాయాలతో, మార్కెట్ అవకాశాలతో అనుసంధానం చేయడం ప్రభుత్వ బాధ్యత.

బీసీ కార్పొరేషన్ల బలోపేతం

బీసీ కార్పొరేషన్లు కేవలం పేరుకే పరిమి తం కాకుండా వాస్తవంగా పేద బీసీ కుటుంబాలకు ఆర్థిక సాధికారత కల్పించే సంస్థలు గా పనిచేయాలి. సబ్సిడీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక పరికరాల కొనుగోలు, మార్కెటింగ్ సదుపాయాలు, స్వయం ఉపాధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయా లి. ఎంబీసీలు, సంచార జాతులు, అత్యంత వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి.

ఆయా కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్న వ్యక్తులను కార్పొరేషన్ల బాధ్యతలు అప్పగిస్తే పథకాలు మరింత సమర్థవంతంగా అమలయ్యే అవకాశం ఉంటుంది. సబ్సిడీ రుణాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న యువత, చిన్న వ్యాపారులు, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తక్షణమే రుణ ప్రక్రియను సులభతరం చేయాలి. బ్యాంకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అర్హులైన బీసీ లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

రిజర్వేషన్లతోపాటు ఆర్థిక సాధికారత

రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి ఒక సాధనం మాత్రమే. అవే అన్ని సమస్యలకు పరిష్కారం కావు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార అవకాశాలు, ఆర్థిక సహాయం, భూమి, వనరుల ప్రాప్తి వంటి అంశాల్లో కూడా సమాన అవకాశాలు కల్పించాలి. బీసీ వర్గాల్లోని పేదరికం, నిరుద్యోగం, విద్యా వెనుకబాటుతనం, వృత్తుల పతనం వంటి సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలి. ముఖ్యంగా మహిళలు, యువత, అత్యంత వెనుకబడిన వర్గాలపై దృష్టిపెట్టాలి.

పేదరికం లేని సమాజ నిర్మాణం

సమగ్ర కులగణన ఏ కులాన్ని మరొక కులానికి వ్యతిరేకంగా నిలబెట్టే ప్రక్రియ కాకూడదు. అది సమాజంలోని అసమానతలను గుర్తించి, ప్రతి వర్గానికి తగిన అవకాశాలు కల్పించే శాస్త్రీయ సాధనం కావాలి. దేశంలో ఎవరి జనాభా ఎంత? ఎవరి విద్యాస్థాయి ఎంత? ఎవరి ఆదాయం ఎంత? ఎవరు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు? ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎవరికి చేరుతున్నాయి? ఎవరు రాజకీయం గా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు? వంటి ప్రశ్నలకు సమగ్ర కులగణన సమాధానాలు ఇవ్వాలి.

ఆకలి, అజ్ఞానం, అనారోగ్యం, నిరుద్యోగం, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం వనరులు, సంపద, అధికారం, అవకాశాలు అన్ని వర్గాలకూ న్యాయంగా అందా లి. శ్రమకు తగిన గౌరవం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించాలి. సంప్రదాయ వృత్తుల నైపుణ్యాలను ఆధునిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయాలి.

దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించి, ఆ గణాంకాల ఆధారంగా విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ విధానాలను పునర్వ్యవస్థీకరిస్తేనే సామాజిక న్యాయం మరింత అర్థవంతంగా మారుతుంది. కులగణన కేవలం లెక్కల కోసం కాదు.. సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం, సమగ్ర అభివృద్ధి కోసమని గుర్తించాలి.

 వ్యాసకర్త సెల్: 9989988912