మార్కెట్లో అమ్మకాల వెల్లువ
గరిష్ఠస్థాయి నుంచి సెన్సెక్స్ 1,600 పాయింట్లు పతనం
రికార్డుస్థాయి నుంచి నిఫ్టీ వెనకడుగు
ముంబై, మే 3: ఒకటి, రెండు రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న స్టాక్ సూచీలు శుక్రవారం అమ్మకాల తాకిడి నిలువునా పతనమయ్యాయి. టెలికం, క్యాపిటల్ గూడ్స్, ఐటీ షేర్లలో ఇన్వెస్టర్లు పొజిషన్లు తగ్గించుకునేందుకు విక్రయాలకు పాల్పడ్డారు. దీనితో బీఎస్‌ఈ సెన్సెక్స్ 733 పాయింట్ల మేర క్షీణించి 74,000 పాయింట్ల దిగువకు జారిపోయింది. 73,878 పాయింట్ల వద్ద నిలిచింది. వాస్తవానికి శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ ఉరుకులు పెట్టి 75,095 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ఈ సూచీ ఆల్‌టైమ్ హై 75,123 పాయింట్లను అందుకోలేక, గరిష్ఠం నుంచి నిలువునా 1,600 పాయింట్లు పడిపోయి ఇంట్రాడే కనిష్ఠస్థాయి 73,467 పాయింట్ల స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరో కొత్త రికార్డుస్థాయి 22,793 పాయింట్లకు చేరిన అనంతరం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ సూచీ రికార్డు గరిష్ఠం నుంచి 400 పాయింట్లకుపైగా పతనమై 22,348 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 172 పాయింట్ల నష్టంతో 22,476 పాయింట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టూబ్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కౌంటర్లలో ఏర్పడిన అమ్మకాల ఒత్తిడికి సూచీలు కుప్పకూలాయని ట్రేడర్లు తెలిపారు.
ఆల్ ఇండియా అప్,ఎల్ అండ్ టీ డౌన్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో 2.8 శాతం పడిపోయింది. నష్టపోయిన షేర్లలో మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే, భారతి ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు ఉన్నాయి. నిఫ్టీ బాస్కెట్‌లో తాజాగా ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన కోల్ ఇండియా 4.75 శాతం లాభపడింది. బజాజ్ ఫైనాన్స్ 1 శాతం మేర పెరగ్గా, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్‌లు గ్రీన్‌లో ముగిసాయి.వివిధ రంగాల సూచీల్లో అధికంగా టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 1.42 శాతం తగ్గింది. రియల్టీ ఇండెక్స్ 1.09 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.01 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.96 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.71 శాతం ఎనర్జీ సూచి 0.61 శాతం, ఐటీ సూచి 0.64 శాతం, కమోడిటీస్ సూచి 0.29 శాతం చొప్పున తగ్గాయి. హెల్త్‌కేర్, మెటల్ ఇండెక్స్‌లు లాభాలతో ముగిసాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 0.55 శాతం చొప్పున తగ్గాయి.
డౌన్‌ట్రెండ్ పరిమితం
విశ్లేషకులు
అంతర్జాతీయ సంకేతాల సానుకూలతతో ట్రేడింగ్ తొలిదశలో మార్కెట్ లాభపడినప్పటికీ, హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల కారణంగా తొలి లాభాలు ఆవిరైపోవడంతో పాటు సూచీలు భారీ నష్టాలతో ముగిసాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. యూఎస్‌లో పేరోల్ డేటా విడుదల కానున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. అయితే కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు ప్రతికూలంగా లేకపోవడం, క్రూడ్ ధరలు తగ్గడం తదితర అనుకూల అంశాలతో మార్కెట్ క్షీణత పరిమితంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్ షేర్లలో ఎక్స్‌ఫోజరు తగ్గించుకుంటున్నందున, ఈ షేర్లు భారీగా తగ్గాయన్నారు.






