12 July, 2026 | 7:16 PM

టైటాన్ లాభంలో స్వల్ప వృద్ధి

04-05-2024 12:10 AM

ఆదాయం రూ.11,257 కోట్లు

19 శాతం పెరిగిన ఆభరణాల అమ్మకాలు

ముంబై, మే 3: టాటా గ్రూప్ జ్యువెల్లరీ, వాచీల తయారీ కంపెనీ టైటాన్ నికరలాభం స్వల్పంగా పెరిగింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్టాండెలోన్ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 7 శాతం వృద్ధిచెంది రూ.786 కోట్లకు చేరింది. ఆదాయం 0.9 శాతం వృద్ధితో రూ.11,257 కోట్ల వద్ద నిలిచింది. శుక్రవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.11 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో టైటాన్ షేరు ధర 1 శాతంపైగా క్షీణించి రూ.3,521 వద్ద నిలిచింది.

86 కొత్త స్టోర్స్ ప్రారంభం

 వివిధ విభాగాల  పనితీరును కంపెనీ వివరిస్తూ జ్యువెలరీ విక్రయాలు 19 శాతం పెరిగాయన్నది. వాచీలు, వేరబుల్స్ వ్యాపారం 0.7 పెరిగిందని, ఐకేర్ డివిజన్ ఆదాయం 0.1 శాతం తగ్గిందని వెల్లడించింది. క్యూ4లో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి 86 కొత్త స్టోర్స్‌ను ప్రారంభించామని, దీంతో తమ మొత్తం స్టోర్స్ సంఖ్య 3,035కు పెరిగిందని టైటాన్ తెలిపింది.