- పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టుపై నీలినీడలు
- పట్టించుకోని జంట కార్పొరేషన్ల పాలకవర్గాలు
- నగరానికి మరో ఐదు రోజుల వర్షసూచన
- ఆందోళనలో లోతట్టు కాలనీల ప్రజలు
మేడిపల్లి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత, ప్రభుత్వం ఊదాసీనత.. వెరసి పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని లోతట్టుకాలనీలు జలమయం. వరద కాలనీలోకి రాకుండా దారిమళ్లించందుకు చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో జంట కార్పొరేషన్ల పరిధిలోని లోతట్టు కాలనీవాసులు ముంపునకు గురయ్యారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఎల్‌బీ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి తదితర నియోజకవర్గాలను వరద ముంచెత్తింది.
వరదనీరు కాలనీల్లోకి రాకుం డా శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో అప్పటి నాటి పురపాలక శాఖ మంత్రి శాఖ మంత్రి ప్రతి నియోజకవర్గానికి రూ.110 కోట్లు విడుదల చేశారు. ఆ సమయంలో మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని లోతట్టు కాలనీలనూ నీటమునిగాయి. నాటి మేయర్ జక్క వెంకట్ రెడ్డి అభ్యర్థన మేరకు నాటి మంత్రి స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ) పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పీర్జాదిగూడ, బోడుప్పల్ పరిధిలో డ్రైన్ పనులకు రూ.110 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
నిర్లక్ష్యం ఇలా..
ప్రభుత్వ ఆదేశాలతో అప్పటి మేయర్ జక్క వెంకట్‌రెడ్డి చొరవ తీసుకుని పీర్జాదిగూడ కార్పొరేషన్‌కు సంబంధించిన రూ.7 కోట్ల నిధులతో పర్వతాపూర్ చెరువు నుంచి మూసీ వరకు పైపులైన్ వేయించారు. పీర్జాదిగూడ మెయిన్ రోడ్డు నుంచి మూసీ నది వరకు బాక్స్ డ్రైన్ పనులను పూర్తి చేశారు. తర్వాత చెంగిచెర్ల చెరువు నుంచి మేడిపల్లి, బచ్‌పన్ స్కూల్ పక్కనుంచి పర్వతాపూర్ చెరువు వరకు, బోడుప్పల్ రా చెరువు నుంచి బండి గార్డెన్ వీధి నుంచి పీర్జాదిగూడ పెద్దచెరువు వరకు పనులు జరగాల్సి ఉంది.
ఈ పనులన్నీ పూర్తయితేనే ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇలా పీర్జాదిగూడలో స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు మధ్యలోనే నిలిచిపోగా, బోడుప్పల్‌లో స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు శంకుస్థా పనకు కూడా నోచుకోలేదు.
తాజాగా వరుసగా కురుస్తున్న వర్షాలతో పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌టీసీ కాలనీ, మారుతీనగర్, గోవా కాలనీ, మా భవాని నగర్, వినాయక్ నగర్, విష్ణుపురి కాలనీ, విష్ణుపురి ఎంక్లేవ్, శ్రీపాద ఎన్‌క్లేవ్, శ్రీరాం ఆర్టీసీ కాలనీ, విహారిక కాలనీ, పంచవటి కాలనీ, సాయినగర్, సుమ రెసిడెన్సీ, అయోధ్య కాలనీ, మల్లికార్జున్ నగర్, బండిగార్డెన్ ప్రాంతాలు జలమయయ్యాయి. నాయకులు, అధికారులు వస్తున్నారు.. ఓదార్చి పోతున్నారే తప్ప.. ఎస్‌ఎన్‌డీపీ పనులపై నోరు మెదపడం లేదని బాధితులు వాపోతున్నారు.
స్ట్రాం వాటర్ డ్రైన్ పనులకు నిధులు ఇవ్వాలి
ప్రభుత్వం మారడంతో ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన స్ట్రాం వాటర్ డ్రైన్ పనుల నిధులు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ముంపు కాలనీ ప్రజల అవస్థలను దృష్టి లో పెట్టుకొని వెంటనే ఎస్‌ఎన్‌డీపీ నిధులను విడుదల చేయాలి. మరో ఐదు రోజులు వర్షా లు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో మా కాల నీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పార్టీలు మారిన కార్పొరేటర్లు ప్రభుత్వం వద్దకు వెళ్లి నిధులు తీసుకురావాలి. లేదంటే భవిష్యత్తులో వారిని ప్రజలు తిరస్కరిస్తారు.
ఎడవెల్లి రఘువర్థన్‌రెడ్డి,
శ్రీపాద ఎన్‌క్లెవ్ కాలనీ అధ్యక్షుడు
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల, వరదల కారణంగా మా కాలనీ నీట మునిగింది. మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ప్రజలు అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు మురుగునీటిని డ్రైన్లలోకి పంపే ఏర్పాట్లు చేయాలి. ప్రతిరోజూ రాత్రి 8 గంటలలోపు ఫాగింగ్ చేపట్టాలి. ఎస్‌ఎన్‌డీపీ పనులు పూర్తి చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
గోరనుకొండ పాండు, విష్ణుపురి ఎర్‌క్లేవ్ కాలనీ జనరల్ సెక్రటరీ