calender_icon.png 9 June, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథ: సమస్య- పరిష్కారం

04-05-2024 12:15:00 AM

బడి గంట కొట్టగానే పిల్లలంతా బయటకు పరుగెత్తారు. రాము మాత్రం మాష్టారు దగ్గరకు వెళ్లాడు. ‘ఏమిటి రాము! ఇటొచ్చావు? ఏమైనా అడగాలనుకుంటున్నావా?’ ‘పరీక్షల సమయం కదా మాష్టారూ! చదువుకుందామంటే ఒకటే నిద్రొస్తోంది. సరిగ్గా చదవలేకపోతున్నాను. మీరేమయినా సలహా ఇస్తారేమోనని’ ‘మంచి సందేహమే... నీ సమస్యకు పరిష్కారం ధ్యానమే’ ‘మాష్టారు! ధ్యానం పెద్ద వాళ్లు కదా చేస్తారు?’ ‘లేదు, రామూ.. ధ్యానానికి చిన్నా, పెద్ద ఉండదు. అలా అందరూ అనుకుంటారంతే. ధ్యానం వల్ల మనకు శక్తి, చైతన్యం లభిస్తాయి. మనకంటే శరీరానికి అన్నమాట. అంతే కాదు ఒక గంట ధ్యానం చేస్తే మూడు గంటలు నిద్ర పోయినదానితో సమానమని చాలా మందికి తెలియదు.

’ ‘అవునా! మాష్టారూ!’ ‘అవును, రాము... అందరూ అనుకున్నంత కష్టం కాదు ఈ ధ్యానం చెయ్యటం కూడా! ‘చెప్పండి మాష్టారూ... నేను చేస్తాను’ ‘నువ్వే కాదు. క్లాసులో పిల్లలందరికీ చెప్పి వారితో చేయించాలి.’ ఊ.. అన్నట్లుగా ఉత్సాహంగా రాము తలూపాడు. ‘ముందుకు పద్మాసనం వేసుకోవాలి. అంటే కాళ్లు రెండు ముడుచుకొని కూర్చోవాలి. చేతులు రెండు కలుపుకొని, నిటారుగా ఉండి, కళ్లు మూసుకొని శ్వాసను గమనించాలి. వస్తున్న ఆలోచనలను పట్టించుకోకుండా శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. దీని వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా? ‘చెప్పండి మాష్టారు..’ ‘ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి ఎక్కువవుతుంది. శారీరకంగా ఆరోగ్యం బాగుపడుతుంది. మనసు ప్రశాంతంగా తయారవుతుంది. ‘ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బుద్ధి వికసిస్తుంది’ ‘అబ్బో...! ఇన్ని లాభాలే...!’ ‘మరి ఏమనుకున్నావురా?’ ‘తెలియదుగా..’ ‘అందుకేగా నీకింత వివరంగా చెప్పింది. మరి ధ్యానం చేస్తావా రోజూ?’ ‘చేస్తాను మాష్టారూ క్రమం తప్పకుండా.. నేనే కాదు తరగతి గదిలో అందరితో చేయిస్తాను’ ‘మంచిది రాము’ అన్నారు మాష్టారు.

నీతి: ధ్యానంతో నిద్రను జయించవచ్చు.. సాధించలేని దాన్ని దేనినయినా సాధించవచ్చు.

 యలమర్తి అనూరాధ, రచయిత్రి