విరాళాల చోరీ సిగ్గుచేటు
- ఆలయ ట్రస్టు ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని కోల్పోయింది
- రామాలయ నిధుల తస్కరణపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు
వయోనాడ్, జూన్ 27: అయోధ్యలోని రామ మందిరం విరాళాల దొంగతనం, దుర్వినియోగం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల నమ్మకం, విశ్వాసాలను కోల్పోవడమేనని విమర్శించారు. వయోనాడ్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశం అనంతరం విరాళాల తస్కరణపై శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
భక్తులు సమర్పించే విరాళాలకు భద్రపరిచేవారిదే బాధ్యత అని, వారినే జవాబుదారీగా చేయాలని డిమాండ్ చేశారు. కిందిస్థాయి ఉద్యోగులు మాత్రమే సీసీ టీవీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి వేలకోట్ల విలువైన కానుకలను తారుమారు చేస్తారా? అని భద్రతా లోపాలను ఎత్తిచూపారు. నిందితులపై నిష్పక్షపాత విచారణ చేపట్టి బాధ్యులను న్యాయస్థానంలో నిలబెట్టాలన్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగిందోననే విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా డిమాండ్ చేశారు.






