18 August, 2026 | 4:03 PM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

24-05-2024 12:39 AM

జిల్లా కలెక్టర్ శశాంక

రంగారెడ్డి, మే 23 (విజయక్రాంతి): జిల్లాలో నకిలీ విత్తనాల చలామణిని ఉక్కుపాదంతో అణిచివేయాలని కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయం ఆవరణలో కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాను నకిలీ విత్తన రహిత జిల్లాగా చేయాలని కోరారు. మరోవైపు, ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని విత్తనాలను అందుబాటులో ఉంచాలని, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వానకాలం సాగుకు జిల్లాలో 4లక్షల 45 వేల 428 హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగుగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూడాలన్నారు. ప్రైవెట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు.

ఎట్టి పరిస్థి తుల్లోనూ ఎక్కడా నకిలీ విత్తనాల పదం వినిపించకూడదన్నారు. ఇతర జిల్లాల నుంచి మన జిల్లాలోకి నకిలీ విత్తనాలు రాకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలన్నారు. గడువు ముగిసిన విత్తనాలు, లైసెన్స్ లేకుండా విక్రయించే వాటిని ఒక ప్రాంతంలో లైసెన్స్ కలిగి ఉండి వేరే ప్రాంతంలో విక్రయాలు జరిపే వారి పైన చర్యలు చేపట్టాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిని గుర్తించి అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేలా చర్యలు చేడుతామని, గతంలో నకిలీ విత్తనాలు విక్రియించిన వారిని గుర్తించి స్థానిక తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి పాల్గొన్నారు.