23 August, 2026 | 4:12 PM

పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు: మహేశ్ కుమార్ గౌడ్

23-08-2026 03:25 PM

నిజామాబాద్ ఆగస్టు20(విజయ క్రాంతి): : తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని అంతర్గతంగా చర్చించుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లేందుకు వివిధ కమిటీలు ఉన్నాయని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లవచ్చని తెలిపారు. అయితే పార్టీ నిర్ణయాలు, నియమాలకు విరుద్ధంగా బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.

పార్టీ క్రమశిక్షణను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలన తర్వాత కొండా సురేఖపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.క్రమశిక్షణా కమిటీ పరిశీలన, సిఫారసుల అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అయితే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన 80శాతం పదవులు పాత కార్యకర్తలకే దక్కుతాయని.. 20శాతం పదువులు కొత్త నేతలకు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.