23 August, 2026 | 4:13 PM

అర్హులైన భూ యజమానులకు న్యాయం చేస్తాం

23-08-2026 03:41 PM

22ఏ నిషేధిత భూముల సమస్యను ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుంది

ఆలేరు, ఆగస్టు 23 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేరిన అర్హులైన భూములను జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో 22ఏ నిషేధిత భూముల సమస్యను సుమారు నాలుగు నెలల క్రితం అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఐలయ్య తెలిపారు. సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను కోరినట్లు చెప్పారు. దీనిపై మంత్రులు సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అర్హులైన భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. పేదల భూములకు రక్షణ కల్పించి, వారికి న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.