మేరా యువ భారత్ వాలంటీర్‌గా వెంకట భవాని ఎంపిక
చివ్వెంల, ఆగస్టు 23 (విజయక్రాంతి): కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేరా యువ భారత్ సంస్థలో భాగంగా జాతీయ యువజన దళం పథకం కింద సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన వెంకట భవాని దిగుటి యువ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు నల్గొండ జిల్లా యువజన అధికారి కార్యాలయం ఎంపిక ఉత్తర్వులు జారీ చేసింది.
మేరా యువ భారత్ వేదిక ద్వారా దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడం, సామాజిక బాధ్యతను పెంపొందించడం, యువతలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాలంటీర్‌గా ఎంపికైన భవాని తన పరిధిలోని యువతకు మేరా యువ భారత్ సంస్థ ఆశయాలు, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ యువజన మండళ్లు, యువత మరియు మేరా యువ భారత్ కేంద్రం మధ్య వారధిగా పనిచేయనున్నారు.
ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించేలా స్థానిక యువతను ఏకం చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్య అవగాహన, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. భవాని ఎంపిక పట్ల స్థానిక సర్పంచ్ ఎ. ఆంజనేయులు, ఉపసర్పంచ్ అనూష, వీబీకే ఝాన్సీ, వార్డు సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామపెద్దలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు






