మెనూ ప్రకారం భోజనం పెట్టకుంటే కఠిన చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ అంకిత్
బూర్గంపాడు, మార్చి 10 (విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. మంగళవారం బూర్గంపాడు మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
తరగతి గదులు, వంటశాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా లేదా అనే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలలో భోజనం తయారీ విధానం, ఆహార పదార్థాల నిల్వ విధానం, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో బయట నుంచి వచ్చే ఆహార పదార్థాలను అనుమతించకూడదని అధికారులకు ఆదేశించారు.
విద్యార్థులను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులకు కూడా భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం అనంతరం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, వంట ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు అందుబాటులో లేనివి గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం తప్పనిసరిగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాఠశాలలో ఉన్న 30 మరుగుదొడ్లను రోజుకు మూడు సార్లు శుభ్రపరచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంతోపాటు ఉదయం రాగి జావ, పల్లి పట్టు ఇవ్వాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహించాలని, ఆ సమయంలో వారికి తగిన స్నాక్స్ అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ కే ఆర్ కె వి ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, పాఠశాల అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




