పశు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కోదాడ, మార్చి 10: కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో సామూహిక గాలికుంటు వ్యాధి నివారణకి ఉచిత టీకా శిబిరాన్ని కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ యెర్నేనికుసుమవెంకటరత్నం బాబు మంగళవారం ప్రారంభించారు. పశుపోషకులందరూ చికిత్స కన్నా నివారణ మేలన్న సామెత గుర్తెరిగి తమ పశువులన్నింటికీ టీకాలు వేయించుకొని ప్రాణాంతక గాలికుంటు వ్యాధి మహమ్మారి నుండి తమ పశువులను కాపాడుకోవాలని సూచించారు.
ముఖ్య అతిధి జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి డా బోడేపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పశుపోషకులకు అత్యంత ఆర్ధిక నష్టం కలిగించే గాలికుంటు వ్యాధి మహమ్మారిని దేశం నుండి శాశ్వతంగా పారదోలడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకుండా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీ ఆరుమాసాలకోసారి గాలికుంటు వ్యాధి నివారణకు టీకా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
టీకా ప్రారంభోత్సవ కార్యక్రమములో స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి పెంటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కాపుగల్లు పశువైద్యాధికారి డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది చంద్రకళ, కర్ణ, సాగర్ పాల్గొన్నారు.




