అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు
జహీరాబాద్, మే 21 : ప్రభుత్వ భూములు, చెరువుల్లో నుంచి అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మండల తహసీల్దార్ భూపాల్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీహరి హెచ్చరించారు. మంగళవారం దినపత్రికలో ‘అక్రమంగా మట్టి తరలింపు’ అనే శీర్షికతో ప్రచురితమైన విషయం విధితమే. అధికారుల ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని హద్నూర్ పెద్ద చెరువు ప్రాజెక్టును సంబంధిత సిబ్బంది వెళ్లి పరిశీలించారు. అప్పటికే సంబంధిత అధికారులు వస్తున్నారన్న సమచారంతో చెరువు పరిసరాల్లో అక్రమంగా మట్టిని తవ్వుతున్న అక్రమార్కులు జేసీబీ, టిప్పర్లతో పారిపోయారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టిని తరలించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ భూమిని పరిశీలించిన అధికారులు
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ రాజోలా గ్రామంలో అక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. మంగళవారం దినపత్రికలో ప్రచురితమైన ‘ప్రభుత్వ భూమి అక్రమణ యత్నం’ అనే శీర్షికు మండల రెవెన్యూ అధికారి భూపాల్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అక్రమణకు గురైన రాజోలా గ్రామంలోని సర్వే నంబర్ 101 ప్రభుత్వ భూమిని ఆర్‌ఐ దుర్గయ్య, సర్వేయర్ లాల్‌సింగ్ పరిశీలించారు. సర్వే చేసే వరకు ఈ భూమిలోకి ఎవరు వెళ్లొద్దన్నారు. ఈ భూమిలో ఏవైన పనులు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. త్వరలోనే అక్రమణకు గురైన భూమిని సర్వే చేస్తామని తెలిపారు.






