‘ప్లే’స్ మరిచారు
నిరూపయోగంగా క్రీడా ప్రాంగణాలు
కనిపించని సామగ్రి.. పట్టించుకోని సార్లు
నిధుల పక్కదారి పట్టినట్లు ఆరోపణలు
అందుబాటులోకి తీసుకురావాలని క్రీడాకారుల వేడుకోలు
జహీరాబాద్, మే 21 (విజయక్రాంతి): క్రీడాకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఊరికొక్కటి, వాడకొక్కటి చొప్పున లక్షలు పోసి క్రీడాప్రాంగణాలకు 2022 జూలైలో పురుడు పోసింది. కానీ, వాటి ఆలన పాలన చూసుకునేవారు లేక ఖాళీ ‘ప్లే’స్‌లే దర్శనమి స్తున్నాయి. ప్రారంభసమయంలో ఏర్పాటు చేసిన కొద్దిపాటి పరికరాలు కూడా ఇప్పుడు మాయమై.. క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారిపోయాయి. జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల పరిధిలో దాదాపు 134 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
వీటిలో కొన్ని స్థలాలు ఇప్పటికీ బోర్డులకే పరిమతమయ్యాయి. కొన్ని సరైన స్థలాలు లేక, బడి, గుట్టల ఆవరణలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వాలీబాల్, షటిల్, ఖోఖో రంగాలకు అవసరమైన ఏర్పాట్లు, అలాగే వ్యాయామ పరికరాలు కొన్ని చోట్ల బిగించగా నాణ్యతలేమీతో తుప్పు పట్టి పనికిరాకుండా మారాయి. వాటి ఆలనా పాలనా లేకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ. 50 వేల నుంచి 75 వేల వరకు ఖర్చు చేసి, ప్రజాధనాన్ని వృథా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయా ప్రాంతాలకు క్రీడాకారులు సరైన వసతులు లేక ప్రాక్టీస్‌కు దూరమవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి, క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
వినియోగంలోకి తీసుకొస్తాం..
క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. క్రీడా ప్రాంగణాల్లో పెరిగిన మొక్కలు చెత్తచేదరాన్ని తొలిగించి బాగు చేయించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులు, కార్యదర్శులకు ఆదేశిలిచ్చాం. అవసరమై సామగ్రి, ఇతర వస్తువులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటాం.
సురేశ్, ఇంచార్జీ ఎంపీడీవో న్యాల్‌కల్ (సంగారెడ్డి)
క్రీడా ప్రాంగణాల్లో వసతులు కల్పించాలి
క్రీడా ప్రాంగణాల్లో అవసరమైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రోజూ గ్రౌండ్‌కు వచ్చి మళ్లీ తిరిగివెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు వీటిపై దృష్టి సారించి సరైన వసతులు కల్పించాలి. లక్షలు పోసి సిద్ధం చేసిన ఆట స్థలాలను వినియోగంలోకి తీసుకురావాలి.
మంగలి రమేశ్,
గ్రామం హద్నూర్
(న్యాల్‌కల్ మండలం)






