24 April, 2026 | 3:16 AM

బీసీలు, ముస్లింల హక్కుల సాధనకు కృషి

24-04-2026 01:48 AM
  1. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
  2. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు 26న ఇందిరా పార్క్ వద్ద ధర్నా
  3. టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  4. ప్రభుత్వంపై టీఆర్పీ ఎంబీటీ సంయుక్త పోరాటానికి శ్రీకారం

హైదరాబాద్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే నిర్ణయంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఎంబీటీ పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీలు కలుస్తాయని, కానీ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కలిసిన పార్టీలు రాష్ట్ర చరిత్రలో టీఆర్పీ, ఎంబీటీ మాత్రమేనన్నారు.

హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న కోట్లాది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకు రాజ్యాధికారం సాధించడం కోసం ఈ సంయుక్త పోరాట లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌తో గతంలో జరిగిన సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా తీసుకొని భుజాన మోసే ఉద్యమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

మైనారిటీలు, బీసీల హక్కులపై ఫోకస్

1956 నుంచి ఇప్పటివరకు ముస్లింల సామాజిక, రాజకీయ పరిస్థితులు ఆశించిన స్థాయిలో మారలేదని మల్లన్న తెలిపారు. ఇప్పటివరకు ఒక ముస్లిం మహిళ కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం పొందలేదని, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం తీవ్ర అన్యాయమన్నారు.సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు అత్యంత వెనుకబడిన వర్గంగా ఉన్నారని గుర్తుచేస్తూ, బీసీ వర్గానికి చెందిన ముస్లింల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని తెలిపారు.

విద్యా వ్యాపారంపై తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో విద్యారంగం భారీ వ్యాపారంగా మారిందని, ఏడాదికి సుమారు రూ.90 వేల కోట్ల వరకు ఫీజుల రూపంలో దందా జరుగుతోందని ఆరోపించారు.అసెంబ్లీలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయన్నారు.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో 73 శాతం వరకు రాజకీయ నాయకుల వాటా ఉందని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు విద్య ను సేవగా చూడాలని పలుమార్లు పేర్కొన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం విద్య పూర్తిగా వ్యాపా రంగా మారిందని విమర్శించారు. అధికారం లో ఉన్న కాంగ్రెస్, గత బీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని అ మలు చేయడంలో విఫలమయ్యాయన్నారు.

ప్రజలకు పిలుపు చలో ఇందిరా పార్క్

హమారా ఇజ్జత్ హమారా హిస్సా హమారా హుకుమత్, మేమంతో మాకంత అనే నినాదాలతో ఈ సంయుక్త ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం ఎంబీటీ నాయకులు అంజద్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ ఇకనుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీతో కలిసి పోరాటం చేస్తామని, ఈ నెల26న నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైట్ టు ఎడ్యుకేషన్ హక్కు సాధన కోసం పోరాటం చేస్తామ న్నారు.అలాగే జూన్ ౨న మల్లన్న చేపట్టబోయే పాదయాత్రకు ఎంబీటీ పార్టీ నుంచి 100 మంది మద్దతుగా  పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ, ఎంబీటీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రైట్ టు ఎడ్యుకేషన్ కోసం తొలి పోరాటం

ఈ సంయుక్త పోరాటంలో తొలి కార్యక్రమంగా ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అమలుకు, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ చట్టం అమలైతే తల్లిదండ్రుల పై ఉన్న ఆర్థిక భారం తగ్గి, పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్య అందుతుందన్నారు.దేశంలో పలుచోట్ల అమలవుతున్న ఈ చట్టం తెలంగాణలో అమలు కాకపోవడంపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.