15 August, 2026 | 3:57 PM

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 03:08 PM

సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రభుత్వ పాలన లక్ష్యం

మంత్రి దామోదర రాజనర్సింహ

స్వయం సహాయక సంఘాలకు రూ.225 కోట్ల  రుణాల పంపిణీ

సంగారెడ్డి, ఆగస్టు 15: నెహ్రూ, ఇందిరమ్మ అందించిన సంక్షేమ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం మంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పేదలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు తదితర వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.

జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.225 కోట్ల విలువైన రుణాల చెక్కును మంత్రి పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడంతో పాటు, చిన్నతరహా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.