జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తాం
యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు
జగిత్యాల,(విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేసి రాబోయే తరానికి ఆదర్శంగా నిలిచే విధంగా యూనియన్ కార్యక్రమాలు చేపడుతున్నామని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలు ఉంటేనే జర్నలిస్టుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ అవుతాం అన్నారు.
జిల్లాలోని యూనియన్ సభ్యులందరికీ ఐడి కార్డులు అందజేసే దిశగా పని చేస్తున్నామని, అందులో 70 శాతం కార్డులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా సభ్యుల వివరాలు త్వరగా పంపిస్తే ఈ నెలాఖరు వరకు ఐడి కార్డులు పంపిణి చేయనున్నట్టు వివరించారు. అక్రిడేషన్ కార్డుల పట్ల అపోహలు వద్దని, అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందేలా యూనియన్ పక్షాన కృషి చేస్తామన్నారు. జిల్లాలో అక్రిడేషన్ కార్డుల జారీ పక్రియ ఇంచార్జి డిపిఆర్వో వల్ల జాప్యం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని పత్రికలకు జివో ఆదారంగా 450 కి పైగా కార్డులు ఇవ్వడానికి కమిటి ఆమోదం తెలిపిందన్నారు. అర్హులకు కార్డు రాకపోతే కొట్లాడదాం కాని అనర్హులు మాత్రం కార్డు పొందరాదన్నారు.
జర్నలిస్టులుగా సమాజం కోసం పని చేసే అర్హులైన వారందరికీ కార్డులను అందజేసేలా చూస్తామన్నారు. వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులందరికీ మొదటి విడత కార్డులు జారీ చేస్తారని వివరించారు. జిల్లాలో జర్నలిస్టుల కోసం శిక్షణా తరగతులు పెట్టుకోవాలని రాష్ట్ర కార్యవర్గానికి తెలిపామని, మీడియా అకాడమి తరుపున శిక్షణా తరగతులు నిర్వహిస్తారన్నారు. ఈ శిక్షణా తరగతులకు 50 నుండి 60 మంది జర్నలిస్టులే అర్హులు కావున జిల్లాలో 3 చోట్ల శిక్షణా తరగతులు కావాలని అకాడమీ చైర్మెన్ ను కోరామని చెప్పారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తాం అన్నారు.
త్వరలో జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా అధికారులతో చర్చించామన్నారు. యూనియన్ కార్యవర్గ సభ్యులు కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. యూనియన్ పక్షాన జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తాం అని అన్నారు. యూనియన్ ప్రాతినిధ్యం లేని మండలాలకు ప్రాతినిధ్యం ఇచ్చి ఈసి మెంబర్లను నియమించాలని సూచించారు. త్వరలో జిల్లా కార్యవర్గానికి ఉప కమిటీలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సీనియారిటీ ఉన్న వారికి ఉప కమిటిల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ప్రతి నెల జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరు కాని వారిని కార్యవర్గం నుండి తొలగిస్తాం అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని కలెక్టర్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అన్ని మండలాల ఎం ఈ ఓలకు సర్క్యూలర్లు అందుతాయన్నారు. అదేవిధంగా యూనియన్ ను విచ్చిన్నం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని హెచ్చరించారు. ఫీల్డ్ లో లేని వారిని యూనియన్ నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. కార్యవర్గ సభ్యులందరూ యూనియన్ పటిష్టతకు విభిన్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు.






