4 August, 2026 | 1:52 AM

వృత్తి నైపుణ్యంతో కేసుల పరిష్కారానికి కృషి

04-08-2026 12:00 AM

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా కేసుల పరిష్కారానికి దోహదపడుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్ సిబ్బందికి వారంరోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, ముఖ్యంగా స్టేషన్ రైటర్ల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం, దర్యాప్తు ప్రమాణాలను పెంపొందించడం, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం సాధించడం, చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించడం, ప్రజలకు మరింత నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా వారంరోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని 2018, 2020, 2024 బ్యాచ్లకు చెందిన పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగనుంది. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు పర్యవేక్షణలో, ఇద్దరు ఏఎస్‌ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ట్రైనర్లుగా వ్యవహరిస్తూ పోలీసు స్టేషన్ విధులు, దర్యాప్తు విధానాలు, రికార్డుల నిర్వహణ, చట్టాల అమలు, ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసు డాక్యుమెంటేషన్, కోర్టు సంబంధిత ప్రక్రియలు, ప్రాక్టికల్ అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరగాలంటే ప్రతి కేసు చట్టబద్ధంగా, పారదర్శకంగా, నాణ్యతతో దర్యాప్తు జరగాలన్నారు. ప్రతి పోలీసు సిబ్బంది భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమంతో పాటు ఇతర సంబంధిత చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.