18-07-2025 12:12:40 AM
పెద్దపల్లి , జూలై17 (విజయ క్రాంతి) ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా విద్యార్థుల హజరు పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో విద్యా శాఖ పని తీరు పై అధికారులతో కన్వర్జేన్స్ సమావేశం నిర్వహించారు.భవిత కేంద్రాల అభివృద్ధి, టీచర్స్, విద్యార్థుల ఎఫ్.ఆర్.ఎస్ విధానంలో హాజరు నమోదు, సుల్తానాబాద్ మండలంలో పైలట్ గా చేపట్టిన మిడ్ డే మిల్స్ యాప్ తదితర అంశాల పై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిత సెంటర్ లలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులకు అనుకూలంగా భవిత సెంటర్లను మనం తీర్చిదిద్దాలని,ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఎఫ్.ఆర్.ఎస్ (ఫేస్ రిక్నాగిషన్ సిస్టం) ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.
పాఠశాలలో 68 శాతం వరకే విద్యార్థుల హాజరు ఉండటం పై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెగ్యులర్ గా పాఠశాలలకు పిల్లలు వచ్చేలా ప్రోత్సహించాలని , గైర్హాజరైన విద్యార్థులను ఫాలో అప్ చేయాలన్నారు.ఎం.ఈ.ఓ లు వారి మండలంలో 5 పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, ఆన్ లైన్ లో వివరాలు సరిగ్గా నమోదు చేస్తున్నారా పరిశీలించి రిపోర్ట్ అందించాలని,సుల్తానాబాద్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ వివరాలను యాప్ లో అప్ డేట్ చేసి, ఆ యాప్ వివరాల ప్రకారం పేమెంట్ చేసేందుకు బిల్లులు సమర్పించడం జరిగిందన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రాబోయే ఐదు సంవత్సరాలలో ఎటువంటి పనులు చేపట్టాల్సిన అవసరం లేకుండా మౌలిక వసతుల కల్పన చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తయారు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.