ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు?
రైల్వే బ్రిడ్జి గుంతలో పడిన విద్యార్థినికి తీవ్ర గాయాలు..
వెన్నుపూస విరిగి NIMSలో చికిత్స,
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం.
తాండూర్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన భారీ గుంతలో పడి జీహెచ్ఎస్ నెం.2 ఉర్దూ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆసియా(17) తీవ్రంగా గాయపడి అచేతన అచేతన స్థితిలో ఉంది. వివరాల్లోకి వెళితే, తాండూర్ పట్టణానికి చెందిన మహ్మద్ అజ్మీర్ కుమార్తె ఆసియా ప్రభుత్వం నెంబర్ 2 పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.
పాఠశాల కు నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో గత నెల 23వ తేదీన పాత తాండూరు రైల్వే గేటు సమీపంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం తవ్విన పెద్ద గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ప్రమాదంలో బాలికకు వెన్నుపూస, స్పైనల్ కార్డ్‌కు, పక్కటెముకలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని...శస్త్ర చికిత్స కోసం దాదాపు 7 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ నిరుపేద కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది.
భద్రతా చర్యలు కరువు: రైల్వే శాఖ కాంట్రాక్టర్ గుంత చుట్టూ ఎలాంటి బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతోనే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. "చిన్నపిల్లలు తిరిగే ప్రాంతంలో ఇంత నిర్లక్ష్యమా?" అని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించాలని కోరారు. బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సహాయం కోసం: బాలిక వైద్య ఖర్చుల నిమిత్తం దాతలు సహాయం చేయాలని తండ్రి మహ్మద్ అజ్మీర్ కోరుతున్నారు.






