13 April, 2026 | 2:22 AM

నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేవు..

13-04-2026 12:45 AM

మెదక్ నర్సింగ్ కళాశాల సందర్శించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి.

మెదక్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా లేవని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నర్సింగ్ కళాశాలను మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు ఎం పద్మ దేవేందర్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ౄME)కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... 120 మంది విద్యార్థులకు ఒకే టాయిలెట్ ఉండటం దురదృష్టకరమని అన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం అందిస్తున్నారని, కూలిపోయిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని మండిపడ్డారు.

కళాశాలలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థుల నుంచి అదనపు మిస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు. వారం రోజుల్లోనే కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం, అధికారులకు గడువు విధించారు. లేదంటే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

గతంలో తమ ప్రభుత్వ హయాంలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేస్తూ, ప్రస్తుతం ప్రభుత్వం వాటిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు. విద్యార్థులు మంచి శిక్షణ పొందితే భవిష్యత్తులో సమాజానికి మెరుగైన సేవలు అందిస్తారని పేర్కొన్నారు. వీరి వెంట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, న్యాయవాది జీవన్ రావు, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కౌన్సిలర్లు బట్టి ఉదయ్, దీపక్ కుమార్, నాయకులు లింగా రెడ్డి, సురేందర్ గౌడ్,కిష్ట గౌడ్, మాయ మల్లేశం ,ఆర్కే శ్రీనివాస్, సంతోష్, సాయి కుమార్, నవీన్, బాలరాజు, కిరణ్, స్వామి నాయక్ తదితరులు ఉన్నారు.