26 June, 2026 | 1:46 AM

మాదకద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ముందుకు రావాలి

26-06-2026 12:17 AM

-మొయినాబాద్ సీఐ మల్లికార్జున రెడ్డి 

మొయినాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం మొయినాబాద్లోని చాలెంజర్స్ స్కూల్ కమ్ కాలేజీలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్హెచ్‌ఓతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంపై, కుటుంబ జీవితం, సమాజంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. అలాగే ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన కఠిన చట్టపరమైన శిక్షల గురించి అవగాహన కల్పించారు.

యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసు సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అలాగే డ్రగ్స్ హెల్ప్లైన్ 1908, డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్  14446 వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.