విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, మార్చి 11 (విజయక్రాంతి): విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లాలోని సూర్యా పేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రైమరీ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణను, తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానా న్ని గమనించి, విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. ఉపాధ్యాయులు మరింత సృజనాత్మకంగా బోధించాలని సూచించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత వంటి సదుపాయాలను కూడా పరిశీలించి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. తదనంతరం అదే గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
దీనిలో భాగంగా కేంద్రంలోని చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. అలాగే ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అదే గ్రామ పరిసర ప్రాంతంలో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామంలోని వీధులు, కాలువలు, చెత్త నిర్వహణ విధానం వంటి అంశాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో చెత్త పేరుకుపోకుండా సమయానికి తొలగించాలని, ప్రజలు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని సూచించారు. ఈయన వెంట డీపీఓ యాదగిరి, తహసిల్దార్ కృష్ణయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




