08-11-2025 12:00:00 AM
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి (64.66 శాతం) రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 8.5 శాతం మేర పెరగడం గమనార్హం. తొలి దశలో మొత్తం 121 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిసింది.
కాగా 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తొలి విడతలో నమోదైన 62.57 శాతం ఇప్పటివరకు అత్యుత్తమం కాగా.. తాజాగా బీహార్ ఓటర్లు ఆ రికార్డును బద్దలు కొట్టి కొత్త మార్పుకు స్వీకారం చుట్టినట్లుగా అనిపిస్తున్నది. అయితే ఓటింగ్ శాతంలో పెరుగుదలను అటు ఎన్డీయే .. ఇటు మహాఘట్‌బంధన్ కూటములు ఎవరికి వారు తమకు అనుకూలంగా భా విస్తున్నాయి. సంప్రదాయంగా చూసుకుంటే అధిక ఓటింగ్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతంగా చూడవచ్చు.
కానీ ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మడానికి వీలేదు. బీహార్ ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఓటింగ్‌లో 5 శాతం ఎక్కువ పెరిగిన ప్రతీసారి అధికారి మార్పిడి జరిగింది. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (1962తో పోలిస్తే) ఓటింగ్ 7 శాతం మేర పెరగడంతో, అప్పటివర కు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి తొలిసారి కాంగ్రేసేతర కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఓటింగ్ 7 శాతం మేర పెరగడంతో ఈసారి జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
1990 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ 5.8 శాతం మేర పెరగడంతో లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధి కారంలోకి రావడానికి మార్గం సుగమయింది. అయితే 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపించింది. అంతకుముందు 2000 సంవత్సరంలో 62.5 శాతంతో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవ్వగా.. 2005 ఎన్నికల్లో మాత్రం 16 శాతం మేర తగ్గి 45.85 శాతం నమోదైంది.
ఈసారి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) తొలిసారి అధికారంలోకి వచ్చింది. బీహార్‌లో తొలి విడత పోలింగ్‌నే కీలకంగా పరిగణిస్తారు. ఎందుకంటే మిథిలాంచల్, కోసి, ముంగేర్, సరన్, బోజ్‌పూర్ లాంటి నియోజకవర్గాలు ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములకు ఆయువుపట్టు. ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్, మహాఘట్ బంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్ సహా ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌధరీ, విజయ్‌కుమార్ సిన్హా బరిలో ఉన్నారు.
2020 ఎన్నికల్లో తొలి విడత అయిన 121 స్థానాల్లో హోరాహోరీ పోటీ సాగింది. అప్పటి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్ 61 స్థానాలు గెలుచుకోగా.. ఎన్డీయే కూటమి 59 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఈసారి పొత్తులు మారడంతో సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదు. మరో 122 స్థానాలకు ఈ నెల 11న రెండో దశ పోలింగ్ జరగనుంది. అంతిమంగా బీహార్‌లో ఓటింగ్ శాతం పెరిగిన ప్రతీసారీ అధికార మార్పునకు నాంది పలికింది. చరిత్ర పునరావృతమవుతుం దా లేదా అన్నది నవంబర్ 14న తేలిపోనుంది.